sedition charges
-
బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన ఇస్లాం ఖాన్
న్యూఢిల్లీ : తనపై నమోదైన దేశ ద్రోహ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఢిల్లీ మైనార్టీ కమిషన్ చైర్మన్ జఫారుల్ ఇస్లాం ఖాన్ శుక్రవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన ల్యాప్‌టాప్, ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోవద్దని కోరారు. తాను ఎలాంటి నేరం చేయలేదని, తనను బెదిరించి బయపెట్టాలనే ఉద్దేశంతోనే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే తాను ప్రభుత్వ ఉద్యోగిని అని, 72 సంవత్సరాల వయస్సు కలిగిన సీనియర్ సిటిజన్ అనే కారణాలతో ఖాన్ ముందుస్తు బెయిల్ కోరారు. గుండె జబ్బులు, రక్తపోటు సమస్యలతో బాధపడుతున్నట్లు అలాగే కోవిడ్-19 వచ్చే అవకాశం ఎక్కువ ఉందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాని కేసు నుంచి తనకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని ఖాన్ తరఫు న్యాయవాదులు వ్రిందా గ్రోవర్, రత్న అప్పెండర్, సౌతిక్ బెనర్జీ పిటిషన్ దాఖలు చేశారు. (ఢిల్లీ మైనారిటీస్ కమిషన్ చైర్మన్‌పై దేశద్రోహం కేసు) కాగా ఏప్రిల్ 28న జఫారుల్ ఇస్లాం తన సోషల్ మీడియా ఖాతా ద్వారా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు అతనిపై దోశ ద్రోహ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఖాన్ వ్యాఖ్యలు మత భవాలను రెచ్చగొట్టే విధంగా, సమాజానికి విఘాతం కలిగించేలా ఉన్నాయని వసంత్ కంజ్ ప్రాంతానికి చెందిన నివాసితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జఫారుల్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ మేరకు సెక్షన్ 124 ఏ(దేశద్రోహం), సెక్షన్ 153ఏ (జాతి వివక్ష వ్యాఖ్యలు) కింద ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ కేసులు నమోదు చేసింది. (జులై 1 నుంచి సీబీఎస్ఈ పరీక్షలు) -
ఢిల్లీ మైనారిటీస్ కమిషన్ చైర్మన్‌పై దేశద్రోహం కేసు
ఢిల్లీ : ఢిల్లీ మైనారిటీస్ కమిషన్ చైర్మన్ జఫారుల్ ఇస్లాం ఖాన్‌పై గురువారం దేశదేహ్రం కింద కేసు నమోదు చేసినట్లు ఢిల్లీ స్పెషల్ పోలీస్ విభాగం పేర్కొంది. రెండురోజుల క్రితం జఫారుల్ ఇస్లాం సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు అతనిపై సెక్షన్ 124 ఏ( దేశద్రోహం), సెక్షన్ 153 ఏ( జాతి వివక్ష వ్యాఖ్యలు) కింద కేసులు నమోదు చేసినట్లు జాయింట్ పోలీస్ కమిషనర్ నీరజ్ ఠాకూర్ తెలిపారు. వసంత్ కంజ్ ప్రాంతానికి చెందిన నివాసితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జఫారుల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. ఏప్రిల్ 28న సోషల్ మీడియా వేదికగా (ట్విటర్, ఫేస్బుక్) మతాలను రెచ్చగొట్టేలా జఫారుల్ వ్యాఖ్యలు ఉన్నాయని, మత సామరస్యానికి విఘాతం కలిగించేలా, సమాజంలో చీలికను తెచ్చేలా అతని వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఖాన్ ఆరోపించిన మత వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. దేశాన్నిమోసం చేసి పారిపోయిన నేరస్థుడి పేరు ఖాన్ తన వ్యాఖ్యల్లో ప్రస్తావించారు. భారత అధికారుల అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్ ఇప్పటికే ఆ నేరస్థుడి మీద రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది. అంతేగాక అతనిపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (యుఎపిఎ), మనీలాండరింగ్, టెర్రర్ సంబంధిత కేసుల కింద బుక్ చేసింది. అలాంటి వ్యక్తిని జఫారుల్ ప్రశంసించడం దేశద్రోహం కిందే లెక్కగడతారని ఫిర్యాదులో ఉంది. అయితే దీనిపై జఫారుల్ స్పందిస్తూ... తనపై ఎఫ్ఐఆర్ నమోదైందన్న వార్తలు అవాస్తవమన్నారు. ఎఫ్ఐఆర్ నమోదైందని తన దృష్టికి వచ్చేంతవరకు ఈ విషయాన్ని నమ్మనన్నారు. అయితే గురువారం ట్విటర్ వేదికగా నెటిజన్లను క్షమాపణలు కోరారు. ' నేను చేసిన ట్వీట్ కొంతమందికి బాధ కలిగించింది. కానీ తన వ్యాఖ్యలతో ఏ ఒక్కరిని కించపరిచాలనే ఉద్దేశం నాకు లేదు. ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించండి' అంటూ జఫారుల్ ఇస్లాం ఖాన్ ట్వీట్ చేశారు. -
10 రోజులు తిహార్ జైలులో ఉన్నా: అభిజిత్ బెనర్జీ
న్యూఢిల్లీ: ప్రవాస భారతీయుడు అభిజిత్ బెనర్జీకి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం దక్కిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని నిర్మూలించడానికి వినూత్న కోణంలో పరిశోధనలు చేసి.. విప్లవాత్మక మార్పులు తెచ్చినందుకు గాను ఈ పురస్కారం వరించింది. పశ్చిమబెంగాల్‌కు చెందిన ఆర్థికవేత్తలు ప్రొఫెసర్ నిర్మల, దీపక్ బెనర్జీలకు 1961లో కోల్‌కతాలో అభిజిత్ బెనర్జీ జన్మించారు. ఆయన విద్యాభ్యాసం అంతా భారత్‌లోనే సాగింది. ప్రపంచంలోనే అత్యుత్తమ నోబెల్ పురస్కారం అందుకున్న ఈ ఆర్థికవేత్త ఒకప్పుడు కరుడుగట్టిన నేరస్తులను ఉంచే తిహార్ జైలులో గడిపారంటే ఆశ్చర్యపోక తప్పదు. ఏదో పెద్ద నేరం చేసి తిహార్ జైలుకు వెళ్లి ఉంటారని భావిస్తే.. పొరపాటే. విద్యార్థి సంఘం నాయకుడికి మద్దతుగా ఓ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నందుకు గాను ఇతర విద్యార్థులతో పాటు అభిజిత్ కూడా తిహార్ జైలులో గడపాల్సి వచ్చింది. ఈ సంఘటన 1983లో చోటు చేసుకుంది. మూడేళ్ల క్రితం ఓ ఆంగ్ల పత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో అభిజిత్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘జేఎన్‌యూలో ఓ విద్యార్థి సంఘం నాయకుడిని బహిష్కరించారు. ఇందుకు నిరసనగా విద్యార్థులందరూ వైస్ చాన్సిలర్‌ను ఘెరావ్ చేశాం. దాంతో నాతోపాటు మరికొందరు విద్యార్థులపై కేసు నమోదు చేసి 10 రోజుల పాటు తిహార్ జైలులో ఉంచారు. మమ్మల్ని కొట్టారు. అంతేకాక మా మీద రాజద్రోహం నేరమే కాక హత్యానేరాన్ని కూడా మోపారు. అయితే దేవుడి దయ వల్ల ఆ తర్వాత వాటిని ఉపసంహరించుకున్నారు. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మా నిరసన కార్యక్రమం వల్ల మేలే జరిగింది. అడ్మినిస్ట్రేషన్ సిస్టంలో మార్పులు జరిగాయి. కానీ పది రోజుల పాటు తిహార్ జైలులో ఉండటం మాత్రం జీవితంలో మర్చిపోలేని భయానక అనుభవం’ అంటూ చెప్పుకొచ్చారు అభిజిత్. ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి కలిపి నోబెల్ పురస్కారం ప్రకటించారు. అమెరికన్ ఆర్థికవేత్త మైకేల్ క్రెమెర్‌తో పాటు అభిజిత్ ఆయన భార్య ఎస్తర్ డఫ్లో సంయుక్తంగా ఈ అవార్డును అందుకోనున్నారు. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన రెండో మహిళగా డఫ్లో నిలిచారు. -
కాంగ్రెస్ నేతలపై దేశద్రోహం అభియోగాలు..
సాక్షి, న్యూఢిల్లీ : సైన్యంపై దిగజారుడు వ్యాఖ్యలు చేశారంటూ సీనియర్ కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, సైఫుద్దీన్ సోజ్‌లపై ఢిల్లీ కోర్టులో దేశద్రోహం ఫిర్యాదు నమోదైంది. పటియాలా హౌస్ కోర్టులో న్యాయవాది శశభూషణ్ఈ మేరకు ఫిర్యాదు దాఖలు చేశారు. జమ్మూ కశ్మీర్లో సైనిక ఆపరేషన్లలో ఉగ్రవాదుల కంటే అమాయక ప్రజలనే ఎక్కువగా హతమారుస్తున్నారని గులాం నబీ ఆజాద్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు ఆజాద్‌పై దేశద్రోహం, నేరపూరిత కుట్ర, సైన్యంపై వదంతులు వ్యాప్తిం చేయడం వంటి అభియోగాలు నమోదు చేసి చర్యలు చేపట్టాలని శశిభూషణ్ కోర్టును అభ్యర్థించారు. సైన్యాన్ని అమాయకులను హతమార్చే కిల్లర్లుగా పేర్కొనడమంటే దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం కంటే ఏమాత్రం తక్కువ కాదని పిటిషనర్ తన అప్పీల్లో పేర్కొన్నారు. మరోవైపు కాశ్మీరీలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలన్న పర్వేజ్ ముషారఫ్ ప్రతిపాదనను సమర్ధించారన్న మాజీ కేంద్ర మంత్రి సైఫుద్దీన్ సోజ్పైనా దేశద్రోహ అభియోగాలు నమోదు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. కాగా తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని సోజ్ ఆరోపించారు. తాను రాసిన పుస్తకావిష్కరణ సందర్భంగా సోజ్ మాట్లాడుతూ పొరుగుదేశంతో యుద్ధాన్ని నివారించేందుకు కశ్మీర్‌ను పాక్‌కు అప్పగించేందుకు వల్లభాయ్ పటేల్ సిద్ధమయ్యారని, ఈ మేరకు పాక్ తొలిప్రధాని లయాఖత్ అలీ ఖాన్‌తో మంతనాలు జరిపారని సోజ్ వ్యాఖ్యానించారు. కశ్మీర్ అంశాన్ని ఐరాసలో లార్డ్ మౌంట్‌బాటెన్ ప్రస్తావించారని, జవహర్లాల్ నెహ్రూ కాదని ఆయన చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ తోసిపుచ్చింది. తన పుస్తకానికి ప్రాచుర్యం కల్పించుకునేందుకే సోజ్ దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టింది. -
ఆ నాణేలు వద్దంటే దేశ ద్రోహం కేసే
పిలిబిత్: ఆర్బీఐ ఆమోదించిన ద్రవ్యాన్ని స్వీకరించేందుకు నిరాకరించిన వ్యక్తులపై సెక్షన్ 124(ఏ) కింది దేశ ద్రోహం కేసు పెట్టవొచ్చని ఉత్తరప్రదేశ్ లోని పిలిబిత్ జిల్లా మేజిస్ట్రేట్ ఉత్వర్వులు ఇచ్చారు. అసలు ఎందుకు ఇలాంటి ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చిందంటే.. పుల్కిత్ శర్మ అనే ఓ వ్యక్తి బరేలీలో ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. ఆయన దుకాణదారుల నుంచి ఆయన పది రూపాయల నాణేలు తీసుకునే వాడుకానీ, ఆయన వద్ద నుంచి తిరిగి వాటిని తీసుకునేందుకు ఎవ్వరూ అంగీకరించేవారు కాదు. ఈ నాణేలకు చట్టపరమితి ఎక్కువకాలం లేదని, చెల్లుబాటుకావని ఊహాగానాలు అందడంతో వాటిని ఎవరూ తీసుకోలేదు. దీంతో అతడి వద్ద గత రెండు మూడు నెలలుగా కుప్పలుగా పది రూపాయల నాణేలు మిగిలిపోయాయి. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో చేరి వాట్సాప్ ద్వారా పలువురి వద్దకు వెళ్లింది. చివరకు జిల్లా వ్యాప్తంగా ఈ వార్త హల్ చల్ చేయడంతో దీనిపై జిల్లా న్యాయమూర్తి స్పందించారు. రూ.10 నాణేనికి చట్టబద్ధత ఉందని, ఆర్బీఐ ఆమోదించిన ద్రవ్యాన్ని నిరాకరిస్తే చట్టపరంగా తప్పు చేసినవారవుతారని అలాంటి వారిపై దేశద్రోహం శిక్ష నమోదు చేయవచ్చని చెప్పారు. -
ప్రభుత్వంపై విమర్శ దేశద్రోహమేమీ కాదు: సుప్రీం
దేశద్రోహ కేసులపై సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వానికి లేదా ప్రభుత్వ పాలసీలకు వ్యతిరేకంగా విమర్శలు చేయడం దేశద్రోహమేమి కాదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ప్రభుత్వాన్ని విమర్శించే వారిపై దేశద్రోహం లేదా పరువునష్టం కేసులు పెట్టడం సరికాదని వెల్లడించింది. ఇటీవల చాలా కేసులు దేశ ద్రోహం కింద నమోదవుతున్న నేపథ్యంలో 1962లోని దేశ ద్రోహ చట్టాన్ని పరిగణలోకి తీసుకున్న దీపక్ మిశ్రా, యూయూ లలిత్‌తో కూడిన బెంచ్ ఈ కేసులపై క్లారిటీ ఇచ్చింది. దేశ ద్రోహ కేసుల అంశాన్ని మళ్లీ పునఃసమీక్షించాల్సినవసరం లేదని వెల్లడించిన బెంచ్, 54 ఏళ్ల క్రితం రాజ్యాంగ ధర్మాసనం ఏవైతే గైడ్‌లైన్సు రూపొందించిందో ప్రస్తుత పరిస్థితుల్లో కూడా అవే గైడ్లైన్సును పాటించాలని ఆదేశించింది. కేదర్ నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ కేసులోని 1962 తీర్పును పరిగణలోకి తీసుకుని, ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు, రాసే స్వేచ్ఛ ప్రజలకు ఉంటుందని వెల్లడించింది. ఇవి విమర్శల రూపంలోనైనా, కామెంట్ల రూపంలోనైనా ఉండొచ్చని క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వానిపై విమర్శలు ప్రజల్లో హింసను ప్రేరేపించే ఉద్దేశ్యంతో చేసేవి కావని తెలిపింది. దేశద్రోహ నేరం కింద కేసు నమోదుచేయాలంటే రెండు ముఖ్యమైన అంశాలు దానిలో ఉండాలని బెంచ్ పేర్కొంది. ఒకటి ప్రభుత్వాన్ని కూలదోయాలనే కుట్ర, రెండు ప్రజాశాంతికి కావాలనే దురుద్దేశపూర్వకంగా భంగం కలిగించడం, హింసను ప్రేరేపించేలా ఉన్నప్పుడు మాత్రమే వాటిని దేశద్రోహ కేసులుగా పరిగణించాలని తెలిపింది. ఐపీసీ సెక్షన్ 124ఏ దుర్వినియోగంపై కోర్టులు జోక్యం చేసుకోవాలని కోరుతూ అడ్వకేట్ ప్రశాంత్ భూషన్ అభ్యర్థిస్తూ ఎన్జీఓ కామన్ కాజ్ కింద సుప్రీంను ఆశ్రయించారు. 1962 తీర్పుపై పోలీసులకు సరిగా అవగాహన లేకపోవడంతో ఈ కేసులను నమోదుచేస్తున్నారని ఆయన చెప్పారు. ఎన్సీఆర్బీ రిపోర్టు ప్రకారం 2014లో 47 కేసులు దేశద్రోహం కింద కేసులు నమోదవ్వగా.. 58 మంది అరెస్టు అయినట్టు ఈ పిటిషన్లో పేర్కొన్నారు. -
'నాతో సెల్ ఫోన్ లేదు'
పట్నా: తనతో సెల్ ఫోన్ లేదని, ఆ స్థోమత కూడా లేదని జేఎన్‌యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ తెలిపాడు. కన్హయ్యతో ఐఫోన్ ఉందని, పీఆర్వో కూడా ఉన్నాడని అతడి వ్యవహారాలు ఆయన చూసుకుంటాడని వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో కన్హయ్య స్పందించాడు. తనకు సెల్ ఫోన్ ఉందని, పీఆర్వోతో వ్యవహారాలు డీలింగ్ చేస్తుంటాడని కొందరు వ్యక్తులు తనమీద కావాలనే ఆరోపణలు చేస్తున్నారని చెప్పాడు. రాజద్రోహం కేసులో ఆరోపణలతో అరెస్టయిన తర్వాత ఇంటికి రావడం ఇదే మొదటిసారని కన్హయ్య చెప్పాడు. తనకు గతేడాది జూలై నుంచి స్కాలర్ ఫిప్ రావడం లేదని, విమానంలో ప్రయాణించడానికి కొనే టిక్కెట్ డబ్బులు కూడా లేవన్నాడు. అందుకే జరిమానా కట్టలేనని చెప్పానని వివరించాడు. తన బ్యాంకు ఖాతాలో కేవలం రూ.200 మాత్రమే ఉన్నాయని వెల్లడించాడు. కొందరు నిర్వాహకులు తనకు మనీ ఇస్తే ఈ విధంగా ఇంటికి రాగలిగాలని చెప్పుకొచ్చాడు. వారి నిరసనకు మద్ధతు తెలిపేందుకు తనను ఇక్కడికి ఆహ్వానింవచారని తెలిపాడు. -
గేటు ముందు పోలీసులు.. గేటు లోపల విద్యార్థులు
న్యూఢిల్లీ: జేఎన్‌యూ వివాదం సందర్భంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే దేశ ద్రోహం పేరిట ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్ ను అరెస్టు చేసిన పోలీసులు ఇదే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమర్ ఖలీద్‌తో సహా ఐదుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. కన్హయ్యతోపాటే వీరిని అరెస్టు చేయాల్సి ఉన్నప్పటికీ వారు ఆ సమయంలో తప్పించుకున్నారు. తాజాగా వారంతా క్యాంపస్‌లోనే ఉన్నట్లు తెలిసింది. అయితే, ఇటీవల తలెత్తిన పరిణామాల కారణంగా యూనివర్సిటీలోకి పోలీసులకు అనుమతి లేదు. దీంతో పోలీసులు ఆ విద్యార్థుల అరెస్టు కోసం గేటు బయటే పడిగాపులు కాస్తుండగా విద్యార్థులు మాత్రం గేటు అవతల క్యాంపస్‌లో ఉన్నారు. దీంతో ఆ ఐదుగురు విద్యార్థుల విషయం ఏం చేద్దామని జేఎన్‌యూ అధికారులు ప్రస్తుతం సమావేశమై చర్చిస్తున్నారు. కాగా, ఈ సమావేశం పూర్తయిన తర్వాత వర్సిటీ వీసీతో మాట్లాడి ఆ విద్యార్థులను తమకు సరెండర్ అవ్వాల్సిందిగా పోలీసులు కోరనున్నట్లు తెలిసింది. ఇక వర్సిటీ రిజిస్ట్రార్ భూపేందర్ జూషి మాట్లాడుతూ ఆ విద్యార్థులు క్యాంపస్ లోనే ఉన్నట్లు తనకు కూడా ఇప్పుడే తెలిసిందని అన్నారు. దానిపై స్పష్టత మాత్రం లేదని, మీడియా ద్వారానే తనకు ఆ సమాచారం తెలిసిందన్నారు. ఆ విద్యార్థులతో మాట్లాడుతారా? పోలీసులతో మాట్లాడతారా? విద్యార్థుల అరెస్టు కోసం పోలీసులను క్యాంపస్ లోకి అనుమతిస్తారా అనే విషయం మాత్రం సమాధానం దాట వేశారు.తమ సమావేశం పూర్తయ్యాక ఎలాంటి పరిణామాలు ఉంటాయో చెప్తానని అన్నారు.