గేటు ముందు పోలీసులు.. గేటు లోపల విద్యార్థులు
న్యూఢిల్లీ: జేఎన్యూ వివాదం సందర్భంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే దేశ ద్రోహం పేరిట ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్ ను అరెస్టు చేసిన పోలీసులు ఇదే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమర్ ఖలీద్తో సహా ఐదుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. కన్హయ్యతోపాటే వీరిని అరెస్టు చేయాల్సి ఉన్నప్పటికీ వారు ఆ సమయంలో తప్పించుకున్నారు. తాజాగా వారంతా క్యాంపస్లోనే ఉన్నట్లు తెలిసింది.
అయితే, ఇటీవల తలెత్తిన పరిణామాల కారణంగా యూనివర్సిటీలోకి పోలీసులకు అనుమతి లేదు. దీంతో పోలీసులు ఆ విద్యార్థుల అరెస్టు కోసం గేటు బయటే పడిగాపులు కాస్తుండగా విద్యార్థులు మాత్రం గేటు అవతల క్యాంపస్లో ఉన్నారు. దీంతో ఆ ఐదుగురు విద్యార్థుల విషయం ఏం చేద్దామని జేఎన్యూ అధికారులు ప్రస్తుతం సమావేశమై చర్చిస్తున్నారు. కాగా, ఈ సమావేశం పూర్తయిన తర్వాత వర్సిటీ వీసీతో మాట్లాడి ఆ విద్యార్థులను తమకు సరెండర్ అవ్వాల్సిందిగా పోలీసులు కోరనున్నట్లు తెలిసింది.
ఇక వర్సిటీ రిజిస్ట్రార్ భూపేందర్ జూషి మాట్లాడుతూ ఆ విద్యార్థులు క్యాంపస్ లోనే ఉన్నట్లు తనకు కూడా ఇప్పుడే తెలిసిందని అన్నారు. దానిపై స్పష్టత మాత్రం లేదని, మీడియా ద్వారానే తనకు ఆ సమాచారం తెలిసిందన్నారు. ఆ విద్యార్థులతో మాట్లాడుతారా? పోలీసులతో మాట్లాడతారా? విద్యార్థుల అరెస్టు కోసం పోలీసులను క్యాంపస్ లోకి అనుమతిస్తారా అనే విషయం మాత్రం సమాధానం దాట వేశారు.తమ సమావేశం పూర్తయ్యాక ఎలాంటి పరిణామాలు ఉంటాయో చెప్తానని అన్నారు.