రెండో రోజూ లోక్‌సభలో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల హల్‌చల్ | Seemandhra Congress MPs disrupted Session in Lok Sabha over Telangana | Sakshi
Sakshi News home page

రెండో రోజూ లోక్‌సభలో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల హల్‌చల్

Published Wed, Aug 7 2013 2:59 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Seemandhra Congress MPs disrupted Session in Lok Sabha over Telangana

రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు రెండో రోజూ లోక్‌సభలో గందరగోళం సృష్టించారు. రాష్ట్రాన్ని యథాతథంగానే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. వెల్‌లోకి దూసుకెళ్లి సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. అయితే, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ వెనక్కు తగ్గాల్సిందిగా పలుమార్లు వారికి సూచించినా నిరసనలు ఆపలేదు. ఉదయం పదకొండు గంటల సమయంలో సభ ప్రారంభమైన కొద్దిసేపటికే కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ఎంపీలు వెల్‌లో ప్రవేశించి టీడీపీ సభ్యులతో కలిసి తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరి నిరసనతో పాటు.. కాశ్మీర్‌లో పాక్ సైనికులు, ఉగ్రవాదుల కాల్పుల్లో ఐదుగురు భారత సైనికులు మృతిచెందిన ఘటనపై నెలకొన్న గందరగోళంతో మూడు నిమిషాల్లోనే లోక్‌సభ వాయిదా పడింది.
 
తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటలకు సభ ప్రారంభం కాగానే.. సోనియా సూచనల మేరకు లగడపాటి రాజగోపాల్, హర్షకుమార్, బాపిరాజు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎస్పీవై రెడ్డి తదితరులు ముందు వరుస స్థానాల వద్దే నిలబడి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నినాదాలు ప్రారంభించారు. ఎంపీలు అనంత వెంకట్రామిరెడ్డి, సబ్బం హరి మాత్రం సభ మధ్యలోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. ఈ గందరగోళంతో సభ మరోసారి వాయిదా పడింది. దాంతో బయటకు వెళ్లడానికి తన స్థానంలో లేచిన సోనియా గాంధీ.. పోడియం వద్ద నుంచి తిరిగివస్తున్న సబ్బం హరిని ఆపి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎన్నో ముఖ్యమైన బిల్లులను ఆమోదించాల్సి ఉందని, సమావేశాలను సాఫీగా నిర్వహించుకొనేందుకు ఎంతో కష్టం మీద ప్రతిపక్షాలను ఒప్పించగలిగితే... మీరు నిరసనలతో సభకు అడ్డుపడడం మంచిది కాదని సూచించినట్లు తెలిసింది.
 
‘‘కావాలంటే.. మీరు కూర్చునే మొదటి వరుస స్థానాల వద్ద నిలబడి నినాదాలు చేసుకోండి, ప్లకార్డులు ప్రదర్శించండి. వెల్‌లోకి మాత్రం వెళ్లవద్దు’’ అని సూచించినట్లు సమాచారం. అయితే, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయంతో సీమాంధ్రకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవడం మినహా తమకు మరో ప్రత్యామ్నాయం లెదని సబ్బం హరి సోనియాతో చెప్పినట్లు తెలుస్తోంది. కాగా, సోనియా సబ్బంహరితో మాట్లాడుతున్న సమయంలో అక్కడికి వచ్చిన తెలంగాణ ప్రాంత కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ జోక్యం చేసుకొని తెలంగాణ గురించి ఏదో చెప్పబోగా... ‘ఆయన మధ్యలో కల్పించుకోవడమేమిటి?’ అని సబ్బంహరి అభ్యంతరం తెలిపారు. దాంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలని సర్వే సత్యనారాయణను సోనియా ఆదేశించినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement