సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభలో గురువారం ఆసక్తికర సన్నివేశం ఒకటి చోటు చేసుకుంది. అధికార పార్టీని, మంత్రులను నిత్యం విమర్శించే కాంగ్రెస్ నేతలు.. కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ పనితీరుపై ప్రశంసలు కురిపించారు. యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ సైతం గడ్కరీ పనితీరును మెచ్చుకున్నారు.మౌలిక వసతులను అభివృద్ధి చేయడంలో ఆయన అద్భుతంగా కృషిచేశారన్న దానిపై ఆమె ఏకీభవించారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో గడ్కరీ శాఖపై రెండు ప్రశ్నలను స్పీకర్ చర్చకు స్వీకరించారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ, 'పార్టీలతో సంబంధం లేకుండా ఇక్కడున్న అందరు ఎంపీలు వారి నియోజకవర్గాల్లో తన శాఖ ద్వారా జరిగిన పనులపై ప్రశంసిస్తున్నారు' అని తెలిపారు. (గడ్కరీ...గారడీ మాటలు!)
ఈ సమయంలో బీజేపీ సభ్యులంతా బల్లలను చరుస్తూ అభినందనలను తెలిపారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎంపీ గణేష్ సింగ్ లేచి నిలబడి... గడ్కరీ కృషికి సభ అభినందనలు తెలపాలని స్పీకర్ సుమిత్ర మహాజన్ను కోరారు. ఈ సమయంలో లోక్ సభలో ఊహించని పరిణామం జరిగింది. అప్పటిదాకా గడ్కరీ చెబుతున్న విషయాలను ఎంతో ఓపికగా వింటున్న యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ... గడ్కరీని అభినందిస్తూ బల్లను చరిచారు. ఆ తర్వాత లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ ఎంపీలందరూ బల్లను చరుస్తూ గడ్కరీని అభినందించారు.
ఉత్తరప్రదేశ్ లోని తన నియోజకవర్గంలో ఉన్న రహదారుల సమస్యపై సానుకూలంగా స్పందించారంటూ ధన్యవాదాలు తెలుపుతూ గడ్కరీకి గతంలో సోనియా లేఖ రాశారు. 'ఇంటిని సరిగా చూసుకోలేనివారు.. దేశాన్ని ఎలా మేనేజ్ చేస్తారు' అంటూ ఇటీవల గడ్కరీ చేసిన వ్యాఖ్యలను రాహుల్ గాంధీ కూడా ప్రశంసించిన సంగతి తెలిసిందే. బీజేపీలో కాస్త ధైర్యం ఉన్న నాయకులు మీరే అంటూ గడ్కరీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఇది చదవండి : ఆ పార్టీలో గడ్కరీ ఒక్కడే సరైనోడు
Comments
Please login to add a commentAdd a comment