ఆగని సెల్ఫీ మరణాలు
చెన్నై: దేశంలో సెల్ఫీ క్రేజ్ మోగిస్తున్న మృత్యు ఘంటికలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తమిళనాడులో మితిమీరిన సెల్ఫీ క్రేజ్ ఓ యువకుడిని బలితీసుకుంది. వేగంగా వస్తున్న రైలు పక్కన సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నించిన దినా సుకుమార్ ప్రాణాలు కోల్పోయాడు. చెన్నైలో ఆదివారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది.
ఇంటర్మీడియట్ చదువుతున్న సుకుమార్ స్నేహితులతో కలిసి రైలుపట్టాలపై వస్తూ.. సెల్ఫీ తీసుకోవాలని ఆశపడ్డాడు. వేగంగా వస్తున్న రైలు బ్యాక్ డ్రాప్ లో ఫొటో తీసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో అదుపుతప్పి రైలు కింద పడి దుర్మరణం పాలయ్యాడు.
కాగా ప్రపంచంలో సంభవిస్తున్న సెల్ఫీ మరణాల్లో సగానికి పైగా ఇండియాలోనే జరుగుతున్నాయని ఇటీవల ఓ సర్వే తేల్చింది. ఇటీవల ముంబై అరేబియా సముద్రంలో సంభవించిన ఓ సెల్ఫీప్రమాదం నేపథ్యంలో నగరంలోని 16 ప్రాంతాల్లో సెల్ఫీలను నిషేధించిన సంగతి తెలిసిందే. ప్రమాదం పొంచి ఉందన్న హెచ్చరికలను యువత పట్టించుకోకపోవడం విచారకరమని పలువురు వ్యాఖ్యానించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.