ఆలయ భూములు అమ్మేస్తున్నారు
- ధూప, దీప, నైవేద్యాలకిచ్చిన భూముల్ని కార్పొరేట్లకిస్తున్నారు
- ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డ స్వరూపానందేంద్ర సరస్వతి
సాక్షి, న్యూఢిల్లీ: భగవంతునికి ధూప, దీప, నైవేద్యాలకోసం దాతలిచ్చిన భూముల్ని తెలుగుదేశం ప్రభుత్వం కార్పొరేట్లకు కట్టబెడుతోందని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మండిపడ్డారు. రుషీకేష్‌లోని శారదా పీఠంలో నిర్వహించబోయే 21వ చాతుర్మాస దీక్షలో పాల్గొనడానికి బయలుదేరిన స్వామీజీ శుక్రవారం ఇక్కడ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఏర్పాటైన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. ప్రస్తుతం ఏపీలో దేవాలయ భూములు అన్యాక్రాంతమైపోతున్నాయని, రిజిస్ట్రేషన్ల్లు జరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. దేవాలయ భూములు అమ్మడానికి కానీ, కొనడానికి కానీ వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన్పటికీ ఆ ఆదేశాలను ఉల్లంఘిస్తూ సదావర్తి సత్రం, కాకినాడ సోమేశ్వర దేవాలయ సత్రం, సింహాచలం దేవాలయ భూములను అడ్డగోలుగా అమ్మేస్తున్నారని స్వరూపానందేంద్ర మండి పడ్డారు.
కోర్టులు ఏమీ చేయలేకపోతున్నాయని, ప్రజానాయకులు ఏమీ చేయలేకపోతున్నారని వాపోయారు. టీడీపీతో సయోధ్య ఉండటం వల్లే బీజేపీ ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆలయ భూములు అన్యాక్రాంతమైపోతుంటే అడ్డుకట్ట వేయకపోగా కొత్త కొత్త జీవోలు తీసుకొచ్చి 33 ఏళ్ల లీజు, 60 ఏళ్ల లీజు,99 ఏళ్ల లీజుల కిచ్చి స్వాహా చేస్తున్నారన్నారు. 5 ఏళ్ల ఉద్యోగానికొచ్చిన ప్రభుత్వాలు అడ్డగోలుగా దేవుడి మాన్యాలు లీజు కివ్వడం ఎంతవరకు సబబని నిలదీశారు. దేశంలో పెద్ద ఎత్తున గోహత్యలు జరుగుతుంటే వాటి ని ఆపలేని స్థితిలో బీజేపీ ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి పాల్గొన్నారు.