
ముస్లింలకు ఓటు వద్దు
ముస్లింలకు ఓటు హక్కు రద్దు చేయాలంటూ శివసేన తన పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో చేసిన డిమాండ్...
శివసేన పత్రిక సామ్నాలో వివాదాస్పద డిమాండ్
⇒ ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని ఆరోపణ
⇒ శివసేనపై విరుచుకుపడిన పలు రాజకీయ పార్టీలు
ముంబై/న్యూఢిల్లీ: ముస్లింలకు ఓటు హక్కు రద్దు చేయాలంటూ శివసేన తన పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో చేసిన డిమాండ్ వివాదాస్పదమైంది. ముస్లింలను పార్టీలు ఓటు బ్యాంకుగా వినియోగించుకుంటున్నాయని, అందువల్ల వారికి ఓటు హక్కు రద్దు చేయాలని సేన డిమాండ్ చేసింది.
సంపాదకీయంలో ఎంఐఎం పార్టీ, ఒవైసీ సోదరులను ఉద్దేశించి శివసేన తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మైనారిటీ వర్గాలను దోచుకుంటున్న విషనాగులుగా వారిని అభివర్ణించింది. ముస్లింలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని, వారి ఆరోగ్యం, విద్య మొదలైన అంశాలనూ రాజకీయం కోసం వినియోగించుకుంటున్నారని ఆరోపించింది. ఇటువంటివి తొలుత కాంగ్రెస్ మొదలుపెట్టిందని విమర్శించింది. ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకున్నంత కాలం వారికి భవిష్యత్తు ఉండదని, అందువల్ల వారికి ఓటు హక్కును ఉపసంహరించాలని బాలాసాహెబ్(బాల్ ఠాక్రే) గతంలో డిమాండ్ చేశారని సంపాదకీయంలో పేర్కొంది.
శివసేన డిమాండ్‌పై వివిధ రాజకీయ పార్టీలు తీవ్రంగా స్పందించాయి. సమాజాన్ని విడగొట్టేలా, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఈ డిమాండ్ ఉందని, ఇటువంటివి ఆమోదయోగ్యం కాదని కాంగ్రెస్ మండిపడింది. ప్రధానిమోదీ ప్రోద్బలంతోనే ఇటువంటి వివాదాస్పద డిమాండ్లు తెరపైకి వస్తున్నాయంది. ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని సమాజ్‌వాదీ పార్టీ.. కేంద్రాన్ని డిమాండ్ చేసింది. తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో శివసేన ఈ అంశాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేసింది. తమ పార్టీ విభజన రాజకీయాలకు వ్యతిరేకమని, కొంత మంది నాయకులు మొత్తం ముస్లింల కోసంకాక తమ అభివృద్ధి కోసమే పనిచేస్తున్నారని చెప్పడమే తమ ఉద్దేశమని వివరణ ఇచ్చింది.
ఇటువంటివారు ముస్లిం వర్గాలకు నిజంగా సహాయం చేయకుండా వారిని తప్పుదోవ పట్టిస్తున్నారని సేన ఎమ్మెల్సీ, అధికారప్రతినిధి డాక్టర్ నీలమ్ గోర్హే పేర్కొన్నారు. శివసేన నాయకుడు, సామ్నా ఎడిటర్ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ముస్లింలకు ఓటు హక్కును కొన్నేళ్లు దూరంగా ఉంచితే.. ముస్లింలను ఓటు బ్యాంకుగా భావించే నాయకులకు వాస్తవ పరిస్థితి తెలుస్తుందన్నారు. ముస్లిం ఓటు బ్యాంకు రాజకీయాలు కొనసాగినంత కాలం దేశంలో అస్థిరత కొనసాగుతుందని చెప్పారు. దీనివల్ల ముస్లింలుకానీ, ఇటు దేశంకానీ ముందుకు వెళ్లాదని రౌత్ పేర్కొన్నారు.