‘సెన్సార్’ చైర్‌పర్సన్‌గా పహ్లాజ్
- సభ్యులుగా జీవిత సహా మరో తొమ్మిది మంది
న్యూఢిల్లీ: కేంద్ర సెన్సార్ బోర్డు(సీబీఎఫ్‌సీ) కొత్త చైర్‌పర్సన్‌గా ప్రముఖ చిత్ర నిర్మాత పహ్లాజ్ నిహలానీ నియమితులయ్యారు. బోర్డులో కొత్తగా తొమ్మిది మంది సభ్యులను కూడా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో నటి, బీజేపీ నాయకురాలు జీవిత కూడా ఉన్నారు. ‘మెసెంజర్ ఆఫ్ గాడ్’ చిత్రంపై వివాదం నేపథ్యంలో లీలా శాంసన్.. సెన్సార్ బోర్డు చైర్‌పర్సన్ పదవికి కొద్దిరోజుల కిందటే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఆమెకు మద్దతుగా బోర్డు సభ్యులు కూడా రాజీనామాలు చేశారు. సోమవారం నుంచి మూడేళ్లపాటు లేదా తదుపరి ఆదేశాలు వెలువడే వరకు నిహలానీ పదవిలో కొనసాగుతారని కేంద్ర సమాచార, ప్రసార శాఖ పేర్కొంది. సభ్యులుగా బీజేపీ నేతలు వాణి త్రిపాఠి టికూ, జీవిత, జార్జ్ బేకర్, నిర్మాతలు అశోక్ పండిత్, చంద్ర ప్రకాశ్, సినీ రచయిత మిహిర్ భుటా, సయ్యద్ అబ్దుల్ బారీ, రమేశ్ పటాన్గే, నటుడు ఎస్.వి.శేఖర్‌ను నియమిస్తున్నట్లు తెలిపింది. ప్రఖ్యాత దర్శకుడు గోవింద్ నిహలానీ సోదరుడైన పహ్లాజ్ నిహలానీ.. ఆంఖేన్, తలాశ్: ద హంట్ బిగిన్స్, షోలా ఔర్ షబ్నమ్ వంటి చిత్రాలను నిర్మించారు.