కర్ణాటకలో తాండవిస్తున్న కరవు | Severe Drought Hits Karnataka | Sakshi
Sakshi News home page

కర్ణాటకలో తాండవిస్తున్న కరవు

Published Mon, Jun 17 2019 6:25 PM | Last Updated on Mon, Jun 17 2019 6:28 PM

Severe Drought Hits Karnataka  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తర కర్ణాటకలోని బెలగావి జిల్లాలో తీవ్ర కరవు పరిస్థితులు తాండవిస్తున్నవి. 2018, అక్టోబర్‌ నుంచి 2018, డిసెంబర్‌ నెల వరకు సరాసరి 152..5 మిల్లీ మీటర్ల వర్షపాతం పడాల్సి ఉండగా, కేవలం 50.6 మిల్లీ మీటర్ల వర్షపాతం మాత్రమే పడింది. ఇదే జిల్లాలోని అథాని తాలూకాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడ 135.7 మిల్లీమీటర్ల వర్షపాతం కురియాల్సి ఉండగా, కేవలం 40 మిల్లీమీటర్ల వర్షం పాతం కురిసింది. ఎక్కువగా జొన్నలు పండించే అక్కడి రైతులు ఈఏడాది పంట వేయలేదు. ప్రత్యామ్నాయంగా ఆవులు, మేకలు కాస్తూ బతుకుతున్నారు. లీటరు పాలు మార్కెట్‌లో 30 రూపాయలు పలుకుతుండడంతో ఆవు పాల వ్యాపారం కాస్త రైతులకు లాభసాటిగానే సాగుతూ వచ్చింది. 

అయితే బొత్తిగా వర్షాలు లేకపోవడం పశువుల పోషణకు కూడా శాపంగా మారింది. నీళ్లు లేక ఆవులను అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. అక్కడ ఈసారి పంటలు వేయకపోవడంతో ‘ప్రధాన మంత్రి ఫాసల్‌ భీమా యోజన కింద అక్కడి రైతులకు భీమా కూడా దక్కదు. వర్షాలు సరిగ్గా లేకపోవడంతో కర్ణాటక ప్రభుత్వం గత సెప్టెంబర్‌ నెలలోనే  రాష్ట్రంలోని 30 జిల్లాలకుగాను 23 జిల్లాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించింది. వీటిలో కూడా 16 జిల్లాల్లో కరవు పరిస్థితులు మరింత తీవ్రంగా ఉన్నాయని ‘సెంట్రల్‌ రీసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డ్రైలాండ్‌ అగ్రికల్చర్‌’ తెలిపింది. బెలగావి జిల్లాను మాత్రం శాశ్వత కరవు ప్రాంతంగా గుర్తించారు. 

వాతావరణ పరిస్థితుల గురించి రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు ‘కర్ణాటక స్టేట్‌ నేచురల్‌ డిజాస్టర్‌ మానిటరింగ్‌ సెంటర్‌’ వరుణ మిత్ర పేరిట ఫోన్‌ సేవలు వినియోగంలోకి తేగా, ఒక్క 2018లోనే దానికి 15,25,000 ఫోన్‌కాల్స్‌ వచ్చాయి. వాటిలో 90 శాతం రైతులు చేసినవే. ఒక్క బెలగావి జిల్లా నుంచి 52,471 కాల్స్‌ వచ్చాయంటే అక్కడి పరిస్థితి తీవ్రతను అంచనా వేయవచ్చు. 700, 800 అడుగుల లోతుకుపోతేగానీ బోరింగ్‌ల్లో నీళ్లు రావడం లేదు. మరో దిక్కు రాష్ట్రంలోని పలు రిజర్వాయర్లో నీటి మట్టం 15 శాతానికి దిగువకు పడిపోయాయి. ఇప్పటికే రుతుపవనాల రాక పక్షం రోజులు ఆలస్యం అవడంతో ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement