గత నవంబర్ లో ఆత్మహత్యాయత్నం చేసిన కునాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యం(ఫైల్ ఫొటో)
కోల్కతా: శారద చిట్ ఫండ్ కుంభకోణంలో నిందితుడు, తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత ఎంపీ కునాల్ ఘోష్ ఆరోగ్యం విషమించింది. కుంభకోణంపై సమగ్ర రదర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్న ఆయన.. గడిచిన 28 రోజులుగా జైలులోనే నిరాహార దీక్ష చేస్తున్నారు.
బీపీ, షుగర్ లెవల్స్ పడిపోవడంతోపాటు శరీరంలో కీటోన్స్ స్థాయి పెగిందని, కునాల్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించాలని జైలు వైద్యులు.. సిబ్బందికి సూచించినట్లు సమాచారం. చిట్ ఫండ్ స్కామ్‌లో అరెస్టయిన కునాల్ రెండేళ్లుగా కోల్కతా సెంట్రల్ జైలులో విచారణా ఖైదీగా ఉన్నారు. గతేడాది నవంబర్లో కునాల్ ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. సకాలంలో జైలు సిబ్బంది స్పందించడంతో ఆయన ప్రాణాలతో బయటపడగలిగారు.
శారదా గ్రూప్‌నకు చెందిన శారదా మీడియా ద్వారా అత్యధిక లబ్ధి పొందింది బెంగాల్ సీఎం మమత బెనర్జీయేనని ఆరోపించడమే కాక, కోర్టులోనూ వాగ్మూలం ఇచ్చిన కునాల్.. 2013లో ఈ స్కాం బయటపడే నాటికి ఆ మీడియాకు సీఈవోగా ఉన్నారు. అప్పటికి పలు పత్రికలు, టీవీ చానళ్లు శారదా మీడియా చేతిలో ఉన్నాయి. ఈ కేసులో తనను బలి పశువును చేశారని తృణమూల్ నేతలపై కునాల్ ధ్వజమెత్తారు. ప్రజల నుంచి వేలకోట్ల రూపాయల డిపాజిట్ వసూలు చేసి మోసానికి పాల్పడిందన్న అభియోగంపై శారద చిట్ ఫండ్ సంస్థపై కోల్ కతా, ఒడిశాల్లో పలు కేసులు నమోదయ్యాయి. ఈ కుంభకోణంలో పెద్ద సంఖ్యలో రాజకీయ నాయకుల హస్తం ఉన్నట్లు ఇప్పటికే రుజువులు లభించాయి.