
గతుకుల రోడ్డుపై వెళ్లలేక.. చాపర్ తెప్పించారు!
రోడ్లన్నీ విపరీతంగా గోతులు పడిపోయాయి. ఒక్క కిలోమీటరు దూరం ప్రయాణించేసరికే నడుం పడిపోతోంది. మామూలుగా వయసులో ఉన్నవాళ్లే ఈ ఇబ్బందులు తప్పడం లేదంటే.. మరి 70 ఏళ్ల వయసులో ఉన్నవారి పరిస్థితి ఎలా ఉంటుంది? అందుకే.. ఆ గోతుల దారిలో వెళ్లలేక ఏకంగా హెలికాప్టర్ తెప్పించుకున్నారో ఎంపీ. ఆయనెవరో కాదు.. ఎప్పుడూ సొంత పార్టీ మీదే విమర్శలు కురిపిస్తూ ఉండే షాట్ గన్.. శత్రుఘ్న సిన్హా. జార్ఖండ్‌లో రాజధాని రాంచీ నుంచి జంషెడ్‌పూర్ వరకు కేవలం వంద కిలోమీటర్ల దూరమే ఉంటుంది. సరే కదా అని రోడ్డు మార్గంలో బయల్దేరిన శత్రుఘ్న సిన్హా.. కొంత దూరం వెళ్లేసరికే ఆ గతుకుల దారిలో ప్రయాణం ఏమాత్రం చేయలేక అక్కడికక్కడే ఆగిపోయారు.
తమ పార్టీకే చెందిన జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్ దాస్‌కు ఫోన్ చేశారు. తాను ఇలా వెళ్లలేనని ఆయనతో చెప్పగానే.. సదరు సీఎం వెంటనే ఒక హెలికాప్టర్ సిద్ధం చేశారు. తన మంత్రివర్గ సహచరుడు లూయిస్ మరాండీని ఇచ్చి మరీ పంపి, శత్రుఘ్న సిన్హాను రాంచీ నుంచి జంషెడ్‌పూర్‌కు 'ఎయిర్‌లిఫ్ట్' చేశారు. రాంచీ - జంషెడ్‌పూర్ మధ్య ఉన్నది జాతీయ రహదారి కావడంతో ఈ దారిని బాగు చేయించాలని కేంద్ర ప్రభుత్వానికి చాలాసార్లు విన్నవించామని, కానీ ఫలితం లేదని మరో మంత్రి సరోయ్ రాయ్ అన్నారు. ఇప్పుడు తాము ఈ రోడ్లకు అలవాటు పడిపోయామని, కొత్తవాళ్లు మాత్రం ఈ గోతుల్లో ప్రయాణం చేయలేరని చెప్పారు.