మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బీజేపీ ఎంపీ
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, పార్టీని ఇబ్బందిపెట్టేలా విమర్శల బాణాన్ని ఎక్కుపెట్టారు. అరుణాచల్ప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించడాన్ని సిన్హా తప్పుపట్టారు. ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫారు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు.
ప్రధాని నరేంద్ర మోదీని పొగుడుతూనే.. ఆయన నిర్ణయాన్ని విమర్శిస్తూ ట్విట్టర్లో వరుస ట్వీట్లు చేశారు. 'మన డాషింగ్ డైనమిక్ యాక్షన్ హీరో ప్రధాని మోదీపై నాకు అపారమైన నమ్మకముంది. అయితే అరుణాచల్ ప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయనకు 'గొప్ప' సలహాదారులు ఎవరు సలహా ఇచ్చారో కానీ నాకు ఆశ్చర్యంగా ఉంది. సలహాదారులు కొన్నిసార్లు తప్పుడు సలహాలు ఇస్తుంటారు. దీనివల్ల పార్టీకి, ప్రభుత్వానికి మంచిదికాదు. మా పార్టీ సహచరులు కొన్నిసార్లు నా అభిప్రాయాలతో ఏకీభవించరు. అయితే ఎప్పుడూ దేశం, పార్టీ మంచి కోసమే నా అభిప్రాయాన్ని చెబుతుంటా. పార్టీ పట్ల నా విధేయతను, నిబద్ధతను గుర్తించాల్సిందిగా అభ్యర్థిస్తున్నా' అని సిన్హా ట్వీట్ చేశారు. గతంలో కూడా పలుమార్లు పార్టీని ఇరుకునపెట్టేలా సిన్హా వ్యాఖ్యలు చేశారు.