'భార్య కుటిలత్వానికి బాధితుడిని'
ముంబై: షీనాబోరా హత్యకేసులో పీటర్ ముఖర్జియాకు విధించిన సీబీఐ కస్టడీని ఈ నెల 30 వరకు పొడిగిస్తూ ముంబై కోర్టు గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. షీనాబోరాను చంపినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంద్రాణి ముఖర్జియా భర్త అయిన పీటర్ ను రెండురోజుల కస్టడీ నిమిత్తం ఢిల్లీకి తరలించి.. తమ కార్యాలయంలో ప్రశ్నించిన సీబీఐ.. అతన్ని గురువారం ముంబైకి తీసుకొచ్చింది. కస్టడీ గడువు ముగియడంతో ముంబై కోర్టులో ప్రవేశపెట్టింది.
ఈసందర్భంగా పీటర్ తరఫు న్యాయవాది మిహిర్ ఘీవాలా వాదనలు వినిపిస్తూ తన భార్య ఇంద్రాణి కుటిల పద్ధతులకు తాను బాధితుడినయ్యానని పీటర్ ఎప్పుడూ చెప్తూ ఉండేవారని కోర్టుకు తెలిపారు. షీనాబోరా హత్యకు కారణం రాహుల్-షీనా అనుబంధం పట్ల ఇంద్రాణికి ఉన్న భయాలే కారణమని సీబీఐ చార్జ్ షీట్ లో పేర్కొందని, అలాంటప్పుడు పీటర్ ఖాతా వివరాలు తెలుసుకునేందుకు ఆయనను సీబీఐ కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని వాదించారు.
అయితే, సీబీఐ మాత్రం పీటర్ కస్టడీ పొడిగించాలని కోర్టును అభ్యర్థించింది. పీటర్ కంపెనీ నుంచి షీనాకు పెద్ద మొత్తం డబ్బు తరలిందని, ఈ డబ్బును ఎందుకు మళ్లించారు? దీని వెనుక కారణాలేమిటి తదితర వివరాలు పత్రాలతో సహా రాబట్టేందుకు పీటర్ కస్టడీ అవసరమని సీబీఐ పేర్కొంది.