అనుమతించిన కోర్టు
కొనసాగిన జూనియర్ డాక్టర్ల నిరసనలు
మమతపై వేలెత్తితే విరిచేస్తాం: మంత్రి
కోల్‌కతా/న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలను రగిలి్చన వైద్యురాలి రేప్, హత్య కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌కు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించడానికి సోమవారం స్థానిక కోర్టు అనుమతించింది. ఆర్‌జి కార్ ఆసుపత్రిలో పీజీ ట్రైనీ డాక్టర్‌ను అత్యంత పాశవికంగా రేప్ చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. నిందితుడికి ఏరోజు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించాలనేది సీబీఐ ఇంకా ఖరారు చేయలేదు. సంజయ్ రాయ్ మానసిక స్థితిని తెలుసుకోవడానికి సీబీఐ ఇదివరకే సైకోఅనాలసిస్ టెస్టు చేసింది.
మరోవైపు కోల్‌కతా పోలీసులు సోషల్ మీడియా పోస్టులపై ఉక్కుపాదం మోపుతున్నారు. అసత్య ప్రచారాన్ని అడ్డుకునేందుకేనని పోలీసులు చెబుతుండగా, నిరసనకారుల గళం నొక్కేందుకేనని విపక్షాలు మండిపడుతున్నాయి. వైద్యురాలి హత్యపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన సీనియర్ డాక్టర్లు కునాల్ సర్కార్, సువర్ణ గోస్వామిలకు సమన్లు జారీ చేయడంతో వారు భారీ ర్యాలీతో కోల్‌కతా పోలీసు కేంద్ర కార్యాలయానికి వచ్చారు.
వైద్య రంగానికి చెందిన వందలాది మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ‘యువ డాక్టర్‌కు న్యాయం కోరుతున్నాం. మేమేమీ నేరం చేయలేదు. పోలీసులు తమ సమన్లను వెనక్కి తీసుకున్నారు. వైద్య పరివారం సహకారాన్ని కోరారు’ అని డాక్టర్ కునాల్ సర్కార్ తెలిపారు. సీఎం మమతా బెనర్జీని బెదిరించినందుకు, బాధితురాలి పేరును సోషల్ మీడియాలో బహిర్గతపర్చినందుకు పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు.
ఆర్‌జి కార్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌ను సీబీఐ వరుసగా నాలుగోరోజు కూడా విచారించింది. మరోవైపు దేశ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల నిరసనలు సోమవారం కూడా కొనసాగాయి. కేంద్ర ఆరోగ్యశాఖతో సోమవారం జరిగిన చర్చలు విఫలమయ్యాయని, అంగీకారయోగ్యమైన ఒప్పందానికి రాలేకపోయామని ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్ (ఫైమా) వెల్లడించింది. వైద్యుల సమ్మె కొనసాగుతుందని ప్రకటించింది.
నేడు సుప్రీంకోర్టు విచారణ
దేశవ్యాప్తంగా డాక్టర్ల సమ్మె, తీవ్ర ఆగ్రహావేశాల నేపథ్యంలో సుప్రీంకోర్టు మంగళవారం పీజీ డాక్టర్ హత్యోదంతంపై సుమోటోగా విచారణ చేపట్టనుంది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం ఉదయం 10:30 గంటలకు విచారణ చేపడుతుంది. ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ మెడికల్ కన్సలె్టంట్స్ ఆఫ్ ఇండియా (ఫామ్కీ), ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఫోర్డా)లు సుమోటో కేసులో తమను భాగస్వాములను చేయాలని సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.
మరోవైపు, వైద్యురాలి హత్యోదంతంలో పశి్చమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని బదనాం చేస్తూ, రాజీనామా చేయాలని ఆమెవైపు వేలెత్తి చూపుతున్న వారి వేలు విరిచివేయాలని సీనియర్ మంత్రి ఉదయన్ గుహా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘మమతపై దాడి చేస్తూ ఆమెను వేలెత్తి చూపుతున్న వారు. రాజీనామాకు డిమాండ్ చేస్తున్న వారు ఎప్పటికీ సఫలం కాలేరు. మమత వైపు ఎత్తిన వేళ్లను విరిచేస్తాం’ అని ఉదయన్ అంటున్న వీడియో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment