శిక్షపడేదాకా నిరసన బాటే! | West Bengal Chief Minister Mamata Banerjee ordered the Kolkata Police to solve the case | Sakshi

శిక్షపడేదాకా నిరసన బాటే!

Aug 13 2024 5:20 AM | Updated on Aug 13 2024 11:34 AM

West Bengal Chief Minister Mamata Banerjee ordered the Kolkata Police to solve the case

రోడ్లపైకి వైద్యులు, వైద్య సిబ్బంది

కుటుంబానికి న్యాయం, వైద్యులకు భద్రత కావాలి

దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ఆందోళనలు, ర్యాలీలు

కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో వైద్యురాలిపై అత్యాచారం, హత్యను నిరసిస్తూ దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్య సిబ్బంది నిరవధిక సమ్మెకు దిగారు. ‘‘విచారణ సత్వరమే పూర్తై దోషులకు కఠిన శిక్ష పడాలి. బాధితురాలి కుటుంబానికి పూర్తి న్యాయం జరగాలి. అప్పటిదాకా అన్ని రకాల వైద్య సేవలనూ నిలిపేస్తున్నాం’’ అని ప్రకటించారు. కోల్‌కతాతో పాటు ఢిల్లీ, ముంబై, చండీగఢ్, లఖ్‌నవూ తదితర అన్ని నగరాల్లోనూ సిబ్బంది రోడ్లపైకొచ్చారు. వైద్య సిబ్బందికి పూర్తి భద్రత కల్పించాలంటూ డిమాండ్‌ చేశారు. ఎయిమ్స్‌ వంటి ప్రఖ్యాత వైద్య సంస్థల సిబ్బంది కూడా ఆందోళనల్లో పాలుపంచుకున్నారు. 

రంగంలోకి మహిళా కమిషన్‌ 
కోల్‌తాలోని ఆర్జీ కర్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో కాన్ఫరెన్స్‌ హాల్లోనే ఓ వైద్యురాలిపై సంజయ్‌రాయ్‌ అనే పౌర వలంటీర్‌ గురువారం దారుణంగా అత్యాచారానికి, హత్యకు పాల్పడటం తెలిసిందే. ఈ దారుణం శుక్రవారం వెలుగు చూసింది. దీనిపై బెంగాల్లో మొదలైన నిరసనలు, ఆందోళనలు అన్నిచోట్లకు పాకాయి. దాంతో నాలుగు రోజులుగా దేశమంతా అట్టుడుకుతోంది. బెంగాల్లోనైతే వైద్య సేవలు పూర్తిగా పడకేశాయి. 

ఫెడరేషన్‌ ఆఫ్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ ఆఫ్‌ ఇండియా (ఫోర్డా) తదితర సంఘాలు సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటించాయి. కేసు దర్యాప్తుకు జాతీయ మహిళా కమిషన్‌ కూడా కోల్‌కతా చేరుకుంది. పోలీసు ఉన్నతాధికారులతో భేటీ అయింది. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ కలకత్తా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై మంగళవారం విచారణ జరగనుంది. కోల్‌కతాలో మెడికల్‌ కాలేజీ నుంచి జరిగిన భారీ ర్యాలీలో ప్రముఖ నటీనటులు రిద్ధీ సేన్, సురాంగనా బంధోపాధ్యాయ, కౌశిక్‌ సేన్, చైతీ ఘోషాల్‌ తదితరులు పాల్గొన్నారు. వైద్యులకు మద్దతుగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు.

వారంలో ఛేదించకుంటే సీబీఐకి: మమత 
వైద్యురాలి కేసును ఆదివారంలోగా ఛేదించాలని బెంగాల్‌ పోలీసులను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదేశించారు. ‘‘ఈ దారుణం వెనక ఆస్పత్రి లోపలి వ్యక్తుల హస్తం కూడా ఉందని వైద్యురాలి కుటుంబం అనుమానిస్తోంది. వారెవరో కనిపెట్టి ఆదివారం లోపు అందరినీ అరెస్టు చేయాలి. లేని పక్షంలో కేసును సీబీఐకి అప్పగిస్తా’’ అని ప్రకటించారు. సోమవారం బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. 

నిజానికి పలు కేసుల దర్యాప్తులో సీబీఐ చేసిందేమీ పెద్దగా లేదంటూ పెదవి విరిచారు. అయినా అవసరమైతే ఈ కేసును దానికి అప్పగిస్తామన్నారు. తీవ్రత దృష్ట్యా ఈ కేసు విచారణను ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుకు అప్పగించాలని అభిప్రాయపడ్డారు. మమత డెడ్‌లైన్‌ నేపథ్యంలో కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ వినీత్‌ గోయల్‌ మీడియాతో మాట్లాడారు. నాలుగైదు రోజుల్లో దోషులందరినీ పట్టుకుంటామన్నారు. ఈ దారుణం గురించి తలచుకుంటేనే గుండె తరుక్కుపోతోందని కాంగ్రెస్‌ నేత ప్రియాంకా గాంధీ అన్నారు. బాధితురాలి కుటుంబానికి సత్వర న్యాయం జరిగేలా చూడాలని తృణమూల్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

నన్ను ఉరి తీసుకోండి: నిందితుడు 
దారుణానికి పాల్పడ్డ సంజయ్‌ రాయ్‌లో పశ్చాత్తాపమే లేదని పోలీసులంటున్నారు. విచారణలో నేరం అంగీకరించడమే గాక, ‘కావాలంటే ఉరి తీసుకొ’మ్మని అన్నట్టు తెలుస్తోంది. రాయ్‌ ఆసుపత్రి ఉద్యోగి కాదు. కోల్‌కతా పోలీసు శాఖలో పౌర వలంటీర్‌గా ఆస్పత్రిలోని పోలీస్‌ ఔట్‌పోస్టులో పని చేస్తున్నాడు. అడ్మిషన్‌ కోసం రోగుల నుంచి డబ్బు వసూలు చేసేవాడు. కోల్‌కతా పోలీస్‌ (కేపీ) అని రాసున్న టీ షర్ట్‌తో తిరుగుతున్నాడు. అతని బైక్‌కు కూడా కేపీ ట్యాగ్‌ ఉంది. రాయ్‌ మొబైల్‌ ఫోన్‌ నిండా అశ్లీల దృశ్యాలే ఉన్నట్టు తెలిసింది.

ప్రిన్సిపాల్‌ రాజీనామా..
వైద్యురాలి హత్యపై దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనల నేపథ్యంలో ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సందీప్‌ ఘోష్‌ సోమవారం రాజీనామా చేశారు. తనపై వస్తున్న విమర్శలను, అవమానాన్ని భరించలేనన్నారు. ‘‘బాధితురాలినే నిందితురాలిగా చిత్రిస్తూ నేను వ్యాఖ్యలు చేశాననడం అబద్ధం. ఆమె నా కూతురి వంటిది. నేనూ ఓ తండ్రినే’’ అన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement