నేను రాజీనామాకు సిద్ధం: మమతా బెనర్జీ | Mamata Banerjee Says Willing To Resign To CM Post | Sakshi
Sakshi News home page

నేను రాజీనామాకు సిద్ధం: మమతా బెనర్జీ

Published Thu, Sep 12 2024 7:53 PM | Last Updated on Thu, Sep 12 2024 8:08 PM

Mamata Banerjee Says Willing To Resign To CM Post

కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచారాన్ని నిరసిస్తూ ఇంకా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మమతా బెనర్జీ ప్రభుత్వంతో చర్చకు జూనియర్‌ డాక్టర్ల మరోసారి నిరాకరించారు. ఈ క్రమంలో సీఎం మమత సంచలన కామెంట్స్‌ చేశారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తాను సీఎం పదవికి రాజీనామా చేయడానికి సిద్ధం ఉన్నట్టు మమత చెప్పుకొచ్చారు. దీంతో, మమత వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

అయితే, అభయ ఘటనపై ఆందోళనల నేపథ్యంలో జూనియర్‌ డాక్టర్లతో మరోసారి చర్చించేందుకు  పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం వారిని  ఆహ్వానించింది. అయితే, వైద్యులు చెబుతున్నట్లుగా 30మంది కాకుండా.. 15మంది ప్రతినిధులను మాత్రమే చర్చలకు అనుమతిస్తామన్నారు. దీంతో డాక్టర్లు ఎవరూ చర్చలకు రాలేదు. ఈ సందర్భంగా డాక్టర్ల కోసం సీఎం దీదీ దాదాపు రెండు గంటల పాటు ఎదురుచూశారు. 

అనంతరం, సీఎం మమత మాట్లాడుతూ.. జూనియర్‌ డాక్టర్లతో చర్చలు జరిపేందుకు ఇప్పటికే మూడుసార్లు యత్నించాను. ఇప్పుడు కూడా వారితో చర్చించేందుకే ముందుకు వచ్చాం. అభయ కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. ఈ కారణంగా చేతనే జూనియర​్‌ డాక్టర్లు డిమాండ్‌ చేస్తున్నట్టు వారితో చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయడం లేదు. కాగా.. ఈ భేటీ వీడియో రికార్డింగ్‌కు ఏర్పాట్లు చేశాం. చివరగా.. సుప్రీంకోర్టు అనుమతితో ఆ ఫుటేజీని వైద్యులకు అందజేస్తాం.  

డాక్టర్లతో చర్చించేందుకు దాదాపు రెండు గంటలపాటు ఎదురుచూశాను. అయినప్పటికీ వారి నుంచి స్పందన లేదు. అయితే, వైద్యులు విధులకు దూరంగా ఉండటంతో ఏడు లక్షల మంది రోగులు ఇబ్బందులు పడుతున్నారు. 27 మంది మృతి చెందారు. వైద్యులకు దేశ ప్రజలు అండగా నిలవండి. ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పెద్దవాళ్లం కాబట్టి వారిని క్షమిస్తాను. ఆర్జీ కర్‌ ఘటనలో బాధితురాలికి న్యాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నాను. వైద్యులకు అండగా నిలిచేందుకు ప్రజా ప్రయోజనం కోసం అవసరమైతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాను’ అంటూ కామెంట్స్‌ చేశారు.

 

కాగా, బెంగాల్‌లో ఆగస్టు 9న జూనియర్ డాక్టర్‌పై జరిగిన దురాగతాన్ని నిరసిస్తూ జూడాల ఆందోళనలు చేపట్టారు. దీంతో బెంగాల్‌లో వైద్యసేవలు చాలా వరకు స్తంభించాయి. ఈనేపథ్యంలో జూనియర్‌ డాక్టర్లతో చర్చలు జరిపించేందకు మమతా సర్కార్‌ ముందుకు వచ్చింది. ఈ మేరకు బెంగాల్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వారికి తాజాగా గురువారం లేఖను పంపారు. ఈరోజు ఐదు గంటలకు చర్చలకు రావాలని లేఖలో పేర్కొన్నారు. 15మంది ప్రతినిధులను మాత్రమే చర్చలకు అనుమతిస్తామన్నారు. అదే విధంగా ఈ ప్రతిపాదిత చర్చలు సీఎం మమతా బెనర్జీ సమక్షంలోనే జరుగుతాయని స్పష్టం చేశారు. చివరగా ట్విస్ట్‌ ఇస్తూ.. చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయాలన్న వైద్యుల ప్రతిపాదనను మాత్రం తిరస్కరించారు. అయితే, ప్రత్యక్ష ప్రసారం ఉండకపోవడంతో ముఖ్యమంత్రి మమతతో చర్చించేందుకు జూనియర్‌ డాక్టర్లు ఎవరూ సీఎం ఆఫీసుకు వెళ్లలేదు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement