
కేరళ గవర్నర్ షీలాపై వేటు!
* 19 మంది గవర్నర్లను మార్చే యోచనలో బీజేపీ
* ఆమెపై కామన్వెల్త్ స్కాం కేసు దర్యాప్తు యోచన
* రాజీనామాకు సిద్ధమైన కర్ణాటక, గుజరాత్ గవర్నర్లు, రాష్ట్రపతితో భేటీ
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ అధికారంలోకి రాగానే.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల గవర్నర్లను తొలగించి కొత్త గవర్నర్లను నియమించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా కేరళ గవర్నర్‌గా ఉన్న ఢిల్లీ మాజీ సీఎం షీలాదీక్షిత్‌ను తొలగించాలంటూ బీజేపీ ఢిల్లీ విభాగం పట్టుపడుతోంది. కామన్‌వెల్త్ క్రీడల స్కాంలో దర్యాప్తు సంస్థలు ఆమెను ప్రశ్నించాలని బీజేపీ కోరుతోంది. మూడు పర్యాయాలు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా గత ఏడాది నవంబర్ నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ చేతిలో ఓడిపోవడం, కేంద్రంలోని యూపీఏ సర్కారు షీలాను కేరళ గవర్నర్‌గా నియమించడం తెలిసిందే. అలా చేయటం ద్వారా అవినీతి ఆరోపణల్లో ఆమెపై దర్యాప్తు జరిపే అవకాశం లేకుండా రక్షణ కల్పించారని బీజేపీ విమర్శించింది. ఆమెపై దర్యాప్తు చేయించేందుకు కామన్వెల్త్ కేసును పునఃప్రారంభించాలని ఆ పార్టీ భావిస్తోంది.
కొత్త గవర్నర్ జనరల్‌తోనే ఢిల్లీ ఎన్నికలు..!
షీలాతో పాటు మరో 18 రాష్ట్రాల గవర్నర్లను కూడా బీజేపీ సర్కారు తొలగించనున్నట్లు చెప్తున్నారు. ఇందులో చాలా మంది కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకులే. బీజేపీ సర్కారు తొలగించనున్న గవర్నర్ల జాబితాలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ పేరు అందరికన్నా ముందు ఉన్నట్లు సమాచారం.
మరోవైపు.. కర్ణాటక గవర్నర్ హన్స్‌రాజ్‌భరద్వాజ్, గుజరాత్ గవర్నర్ కమలాబేనీవాల్‌లు ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాను కలిసి.. తమ పదవులకు రాజీనామా చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. వారిద్దరూ తమ రాజీనామాలను సమర్పించేందుకు రాష్ట్రపతినీ కలిశారు.