సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్ జెండాలను పోలిన ఆకుపచ్చ జెండాలను భారతదేశంలో నిషేధించాలని షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ వసీం రజ్వీ సుప్రీంకోర్టు పిల్ దాఖలు చేశారు. దేశంలో చాలా చోట్ల నెలవంక, నక్షత్రంతో కూడిన ఆకుపచ్చ రంగ జెండాలను ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో ఎగరవేస్తున్నారని, వాటిని నిషేధించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం తెలుసుకున్న తరువాత తుది నిర్ణయం ప్రకటిస్తామని సోమవారం పేర్కొంది.
ఈ మేరకు కేంద్రం అభిప్రాయాన్ని వ్యక్తం చేయాల్సిందిగా అదనపు సోలిటరీ జనరల్ తుషార్ మెహతాను జస్టిస్ ఎకే సిక్రి, అశోక్ భూషన్‌లతో కూడిన ధర్మాసనం కోరింది. ముస్లింలు అధికంగా ఉండే ముంబై లాంటి ప్రాంతాల్లో భవనాలపైన, మత స్మారక చిహ్నాలపైన పాకిస్తాన్‌కు చెందిన ముస్లిం లీగ్ పార్టీ జెండాను పొలిన జెండాలను ఎగరవేస్తున్నారని వసీం రజ్వీ తన పిటిషన్‌లో తెలిపారు. పాకిస్తాన్ భారత్‌కు శత్రు దేశమని, అలాంటి జెండాలు దేశంలో ఉండటానికి వీల్లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ జెండాలు హిందూ-ముస్లింల మధ్య విభేదాలు సృష్టించే అవకాశం ఉందన్నారు. నెలవంక, నక్షత్రంతో కూడిన ఆకుపచ్చ జెండా 1906లో మహ్మద్ అలీ జిన్నా స్థాపించిన ముస్లిం లీగ్ పార్టీకి చెందినది. మన దేశంలో దాన్ని ఇస్లామిక్ జెండాగా భావిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment