ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ వ్యవహారం ఎన్డీయే మిత్రపక్షాలు బీజేపీ, శివసేనల మధ్య చిచ్చురాజేస్తోంది.
ముంబై: ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ వ్యవహారం ఎన్డీయే మిత్రపక్షాలు బీజేపీ, శివసేనల మధ్య చిచ్చురాజేస్తోంది. ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్ మరియాకు శివసేన మద్దతుగా నిలిచింది. మోదీ వివాదంలో విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజెల మాదిరిగా రాకేష్కు ఎందుకు అండగా ఉండటం లేదని శివసేన పార్టీ పత్రిక సామ్నాలో బీజేపీని ప్రశ్నించింది.
వీసా మంజూరు విషయంలో సాయం చేసిన సుష్మా, రాజెలకు బీజేపీ బాసటగా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా లండన్లో సమావేశమైన ముంబై పోలీస్ చీఫ్ రాకేష్పై చర్యలు తీసుకోవడానికి మహారాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో శివసేన స్పందించింది. 'లలిత్ మోదీ ఐపీఎల్లో అవతకవకలకు పాల్పడ్డాడు. ప్రభుత్వ యంత్రాంగం అనుమతితో మోదీ లండన్లో ఉంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ముంబై పోలీస్ కమిషనర్కు మోదీని అరెస్ట్ చేసి భారత్కు తీసుకువచ్చే అధికారం లేదు. ఐపీఎల్ చైర్మన్గా మోదీకి చాలా మంది రాజకీయ నాయకులతో సంబంధాలున్నాయి. వీరందరిపైనా చర్యలు తీసుకుంటారా' అని సామ్నా సంపాదకీయంలో పేర్కొంది.