మహారాష్ట్ర సర్కారులోకి శివసేన
మంత్రులుగా పది మంది ప్రమాణం
బీజేపీ తరఫున మరో పది మంది మంత్రుల ప్రమాణం
15 ఏళ్ల తర్వాత మళ్లీ బీజేపీ-సేన ప్రభుత్వం
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ఎన్నికల ముందు నుంచి బీజేపీ-శివసేన పార్టీల మధ్య జరిగిన నాటకీయ పరిణామాలకు ఎట్టకేలకు తెరపడింది. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించుకున్న రెండు పార్టీలు తిరిగి ఒక్కటయ్యాయి. దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని మహారాష్ట్ర సర్కారులో శివసేన భాగస్వామిగా చేరింది. శివసేన తరఫు నుంచి ఐదుగురు కేబినెట్ మంత్రులుగా, మరో ఐదుగురు సహాయ హోదాతో మొత్తం పది మందికి మంత్రులుగా అవకాశం లభించింది. దీంతో 15 ఏళ్ల తర్వాత మళ్లీ బీజేపీ-శివసేన నేతృత్వంలోని కాషాయ కూటమి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లయింది. మరో విశేషం ఏమిటంటే ప్రతిపక్ష హోదాలోని పార్టీ ప్రభుత్వంలో చేరడం, అది కూడా ప్రభుత్వం ఏర్పాటైన నెల రోజుల సమయంలో కావడం గమనార్హం.
మహారాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు బీజేపీ, శివసేన మంత్రుల పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేల సమక్షంలో ఆ రాష్ట్ర గవర్నర్ సి.హెచ్.విద్యాసాగర్‌రావు మొత్తం 20 మందితో మంత్రులుగా ప్రమాణం చేయిం చారు. ఇందులో కేబినెట్ మంత్రులుగా బీజేపీ తరఫున గిరీష్ బాపట్, గిరీష్ మహాజన్, చంద్రశేఖర్ బావన్‌కులే, బబన్‌రావ్ లోణికార్, రాజ్‌కుమార్ బడోలేతో పాటు శివసేన తరఫున దివాకర్ రావుతే, సుభాష్ దేశాయ్, రాందాస్ కదం, ఏక్‌నాథ్ షిండే, దీపక్ సావంత్ ప్రమాణం చేశారు.
సహాయ మంత్రులుగా బీజేపీ తరఫున రామ్ షిండే, విజయ్‌కుమార్ దేశ్‌ముఖ్, అంబరీష్ రాజే ఆత్రాం, రంజిత్ పాటిల్, ప్రవీణ్ పోటే, శివసేన తరఫున సంజయ్ రాఠోడ్, దాదాజీ భుసే, విజయ్ శివ్‌తారే, దీపక్ కేసర్కర్, రవీంద్ర వాయ్‌కర్ ప్రమాణం చేశారు. అయితే ఈ మంత్రివర్గ విస్తరణలో బీజేపీ, శివసేన మినహా మిత్రపక్షాలైన ఆర్పీఐ, శివ్‌సంగ్రామ్ పార్టీలకు అవకాశమివ్వలేదు. దీంతో వారు కొంత అసంతృప్తికి గురైనట్లు గుర్తించిన ఫడ్నవిస్.. త్వరలో జరిగే రెండో విడత విస్తరణలో అవకాశం ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.