మహారాష్ట్ర అసెంబ్లీలో స్పీకర్ ఎన్నికకు కొన్ని గంటల ముందు ప్రతిపక్ష శివసేన, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ఉపసంహరించుకున్నాయి.
మహారాష్ట్ర అసెంబ్లీలో స్పీకర్ ఎన్నికకు కొన్ని గంటల ముందు ప్రతిపక్ష శివసేన, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ఉపసంహరించుకున్నాయి. దీంతో బీజేపీ అభ్యర్థి హరిభావు బాగ్డే ఏకగ్రీవంగా స్పీకర్ అయ్యే అవకాశం ఏర్పడింది. ఆయన ఔరంగాబాద్ జిల్లా నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో స్పీకర్ ఎన్నిక జరగనుంది. తొలుత శివసేన నుంచి విజయ్ ఔటి, కాంగ్రెస్ నుంచి వర్షా గైక్వాడ్ స్పీకర్ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. అయితే, తర్వాత ఇరుపార్టీలూ అభ్యర్థులను ఉపసంహరించుకున్నాయి.
స్పీకర్ ఎన్నిక వరకు సహకరించినా, విశ్వాస పరీక్షలో మాత్రం బీజేపీకి వ్యతిరేకంగానే ఓటేయాలని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే తన ఎమ్మెల్యేలకు సూచించారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తప్ప.. వేరెవరి నుంచి ఎలాంటి ప్రతిపాదన వచ్చినా ఆమోదించేది లేదని ఠాక్రే కుండ బద్దలుకొట్టి చెబుతున్నారు. అయితే.. తమకు స్వతంత్రులు, చిన్న పార్టీల సభ్యులతో కలిపి 138 మంది మద్దతు ఉందని బీజేపీ చెబుతోంది. ఎన్సీపీ కూడా బేషరతుగా మద్దతు ఇచ్చేందుకు ముందుకు రావడంతో ధీమాగా ఉంది.