
మోదీపై శివసేన ధ్వజం
ముంబై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై బీజేపీ అనుబంధ సంస్థ శివసేన మరోసారి విరుచుకుపడింది. బిహార్ పై ఎనలేని ప్రేమ కురిపిస్తూ ప్యాకేజీలను ప్రకటిస్తున్నమోదీ కాకులను కొట్టి గద్దలకేసిన చందంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తింది. తన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో మోదీ ప్రభుత్వ తీరుపై విమర్శలు ఎక్కుపెట్టింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో కుదేలైన మహారాష్ట్రకు ఆర్థిక సాయం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించింది.
రాష్ట్రంలో విధించిన సర్ చార్జీ ద్వారా వసూలు చేసిన రూ. 1600 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం బిహార్ కు పంచి పెడుతోందని ఆరోపించింది. ఒకవైపు మహారాష్ట్ర కరువు పరిస్థితులతో అల్లాడుతోంటే బిహార్పై మోదీ వరాల జల్లు కురిపిస్తున్నారని మండిపడింది. మహారాష్ట్ర, విదర్భ, మరాట్వాడాలో వందలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోవడంలేదని ఆరోపించింది.
బిహార్ కు ప్రకటించినట్టుగా లక్షా పాతిక వేల కోట్ల రూపాయల ప్యాకేజీ మహారాష్ట్రకు అవసరం లేదని పేర్కొంది. పంట నష్టపోయిన తమ రైతులను ఆదుకునేందుకు కేవలం ఇరవై నుండి ఇరవై అయిదు కోట్ల రూపాయలు సరిపోతుందంటూ వ్యాఖ్యానించింది.