
ఐస్ క్రీమ్ కోసం పెళ్ళి కాన్సిల్!
మథురః పెళ్ళిలో కట్నకానుకలు అడిగినంత ఇవ్వలేదనో, మర్యాదలు సరిగా చేయలేదనో పెళ్ళికొడుకు, అత్తింటివారు అలగడం చూస్తాం. ఒక్కోసారి కట్నం కోసం పెళ్ళిళ్ళు కాన్సిల్ అయిపోవడం చూస్తాం. కానీ అక్కడ మాత్రం కేవలం ఐస్ క్రీం... పెళ్ళి క్యాన్సిల్ అవ్వడానికి కారణమైంది. ఐస్ క్రీమ్ కోసం వచ్చిన గొడవ చినికి చినికి గాలివానగా మారింది. అడ్డొచ్చిన పోలీసులనూ తీవ్రంగా గాయపడేలా చేసింది. చివరికి పెళ్ళి.. పీటలమీదే ఆగిపోయేలా చేసింది.
ఉత్తర ప్రదేశ్ కు చెందిన మధుర, మహేష్ నగర్ లో జరిగిన ఘటన.. అందర్నీ ఆశ్చర్య పరిచింది. పెళ్ళి వేడుకలో భాగంగా నిర్వహించే జయమాలా కార్యక్రమంలో పెళ్ళికొడుకు తరపున వచ్చిన కొందరు బంధువులు ఐస్ క్రీమ్ అడిగినంత ఇవ్వలేదని గొడవకు దిగారు. దీంతో అక్కడి పరిస్థితి రణరంగంగా మారింది. అడ్డొచ్చిన పోలీసులపై వధువు తరపు మహిళలతో సహా రాళ్ళు రువ్వారు. అక్కడినుంచీ వారిని తరిమి కొట్టారు. రోడ్లు కూడ దిగ్బంధనం చేశారు. గొడవలో ముగ్గురు పోలీసులు కూడ తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ప్రత్యేక ఫోర్స్ తో వచ్చిన పోలీసులు రాయసదాబాద్ రోడ్డును క్లియర్ చేసి, అక్కడి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఘటన అనంతరం ఇరు వర్గాల వారిపై ఎఫ్ ఐ ఆర్ బుక్ చేసినట్లు పోలీసులు తెలిపారురు. వరుడి తరపు బంధువుల ఫిర్యాదుతో గొడవకు కారణమైన ఏడుగుర్ని అరెస్టు చేసిన్నట్లు స్థానిక ఎస్పీ.. అరుణ్ కుమార్ సింగ్ వెల్లడించారు. ఐస్ క్రీమ్ కోసం ఇరు కుటుంబాల మధ్య వచ్చిన గొడవతో చివరికి వివాహాన్ని రద్దు చేసుకున్న మగపెళ్ళివారు... అక్కడినుంచీ వెళ్ళిపోయారు.