ముఖ్యమంత్రి తనయుడిపై దుమారం!
బెంగళూరు: ఖరీదైన చేతి గడియారం వివాదం ముగియకముందే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను మరో బాగోతం చుట్టుముట్టుకుంది. తన కొడుకు డైరెక్టర్‌గా ఉన్న ఓ ప్రైవేటు కంపెనీకి ప్రభుత్వ కాంట్రాక్టు దక్కడం దుమారం రేపుతోంది.
ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో ప్రైవేటు మెడికల్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ ఏర్పాటుకు ఇటీవల మాట్రిక్స్ ఇమేజింగ్ సొల్యూషన్స్ లిమిటెడ్ తో కర్ణాటక ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. 2009 అక్టోబర్‌లో రమేశ్ గౌడ సీఎం, సతీష్ ప్రసాద్ భాగస్వాములుగా ఈ కంపెనీ ఏర్పాటైంది. 2014 సెప్టెంబర్ లో ఈ కంపెనీ డైరెక్టర్‌గా సీఎం కొడుకు డాక్టర్ యతీంద్ర సిద్దరామయ్య చేరారు. విక్టోరియా ప్రభుత్వాస్పత్రిలో ల్యాబ్ ఏర్పాటుకు గత ఏడాది సెప్టెంబర్‌లో వేలంపాట నిర్వహించగా.. ఈ కాంట్రాక్టును ప్రభుత్వం మాట్రిక్స్ కంపెనీకి అప్పగించింది. ఇలా సీఎం తనయుడి సంస్థకు ప్రభుత్వ లబ్ధి చేకూర్చడం.. అధికార దుర్వినియోగం, ఆశ్రిత పక్షపాతమేనని తనపై రాజకీయంగా తీవ్ర ఆరోపణలు రావడంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. ఈ కాంట్రాక్టు అప్పగించడంలో ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని ఆయన వివరణ ఇచ్చారు.
'ఈ వ్యవహారమంతా పారదర్శకంగా, చట్టబద్ధంగా జరిగింది. ఈ కాంట్రాక్టు అప్పగించడంలో ఎలాంటి తప్పు జరగలేదు. నా కొడుకు వృత్తిరీత్య డాక్టర్. అతని స్నేహితుడు ఈ కంపెనీ స్థాపించాడు. నా కొడుకు డైరెక్టర్‌గా ఉన్నాడు' అని సిద్దరామయ్య తెలిపారు. ఈ కాంట్రాక్టు విషయంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, కావాలంటే ఈ కంపెనీ డైరెక్టర్ పదవి నుంచి వైదొలిగేందుకు సిద్ధమని సీఎం కొడుకు యతీంద్ర తెలిపారు. ప్రతిపక్ష బీజేపీ మాత్రం ఈ వ్యవహారంపై డిమాండ్ చేస్తోంది. 'ఆయన సీఎం కొడుకు అయినంతమాత్రాన ఏ పని చేయకూడదని కాదు. కానీ, ఆ కాంట్రాక్టు చట్టప్రకారం ఇచ్చారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. అందుకే ఈ వ్యవహారంపై విచారణ జరగాల్సిందే' అని కర్ణాటక ప్రతిపక్ష నేత, బీజేపీ నాయకుడు కేఎస్ ఈశ్వరప్ప అంటున్నారు.