గణేశుడి విరాళం.. 40 కిలోల బంగారం!
దేశంలోనే అత్యంత ధనిక ఆలయాల్లో ఒకటి.. ముంబై సిద్దివినాయకుడి గుడి. అలాంటి ఆలయం నుంచి 40 కిలోల బంగారాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన బంగారం డిపాజిట్ పథకానికి తరలిస్తున్నారు. దీని ద్వారా ఆలయానికి ఏడాదికి రూ. 69 లక్షల వడ్డీ వస్తుందని భావిస్తున్నారు. ఈ పథకంలో ఇప్పటివరకు అత్యంత పెద్దస్థాయిలో వచ్చిన బంగారం ఇదేనని అంటున్నారు. దీంతో క్రమంగా తిరుమల, షిరిడీ లాంటి పెద్ద ఆలయాల నుంచి కూడా బంగారం డిపాజిట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. నిజానికి ఇప్పటివరకు ఈ పథకానికి పెద్దగా ఆదరణ లభించలేదు. దేశవ్యాప్తంగా కేవలం 400 గ్రాముల బంగారం మాత్రమే వచ్చింది. దేశం మొత్తమ్మీద ప్రజల వద్ద దాదాపు 20వేల టన్నుల బంగారం ఉందని, దాని విలువ దాదాపు రూ. 52 లక్షల కోట్లని అంచనా.
తాజాగా ముంబై సిద్ది వినాయకుడి గుడి నిర్ణయంతో ఈ పథకానికి ఊపొస్తుందని అనుకుంటున్నారు. ప్రభుత్వ నియంత్రణలోని మింట్ వద్దకు ఈ బంగారాన్ని పంపి, అక్కడ దాన్ని కరిగించి బంగారు బిస్కట్లుగా మారుస్తారు. ఆలయాలకు భక్తుల నుంచి విరాళంగా వర్చే బంగారం చాలావరకు ఆభరణాల రూపంలో ఉంటుంది. దాంతో, 40 కిలోల ఆభరణాలను కరిగిస్తే స్వచ్ఛమైన బంగారం 30 కిలోల వరకు మాత్రమే వస్తుందని అంటున్నారు. 10 గ్రాముల బంగారం రూ. 25వేల వంతున లెక్కిస్తే, ఈ 30 కిలోల బంగారం విలువ రూ. 7.5 కోట్లు అవుతుంది. దానిమీద దాదాపు ఏడాదికి రూ. 69 లక్షల వడ్డీ వస్తుంది. ప్రస్తుతం సిద్దివినాయక ఆలయంలో దాదాపు 165 కిలోల బంగారం ఉంది. ఇప్పటికే పది కిలోల బంగారాన్ని ఎస్‌బీఐలో డిపాజిట్ చేయగా, దానిమీద ఏడాదికి ఒకశాతం వడ్డీ వస్తోంది.