పద్మనాభ స్వామి వజ్రాలు దొరికాయ్
తిరువనంతపురం: కేరళలోని ప్రముఖ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో కనిపించకుండా పోయిన 26 వజ్రాల్లో 12 తిరిగి దొరికాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం వీటిని ఆలయం పరిసరాలలోనే గుర్తించింది. ఇది దొంగతనం కాదనీ, కొన్ని సంవత్సరాల క్రితం వజ్రాలను స్వామివారికి అలంకరిస్తున్నప్పుడో, మరో సమయంలోనో కనిపించకుండా పోయాయని దర్యాప్తు అధికారులు చెప్పారు. స్వామి అలంకరణకు ఉపయోగించే ఆభరణాలలో ఈ వజ్రాలు కూడా భాగమే.
వజ్రాల విలువ కొన్ని కోట్ల రూపాయలు ఉంటుందనీ, ఎంత విలువ అనేది కచ్చితంగా ఇప్పుడే చెప్పలేమని అధికారులు పేర్కొన్నారు. 12 వజ్రాలతోపాటు గతంలో పోయిన మరికొన్ని విలువైన వస్తువులను కూడా దర్యాప్తు బృందం గుర్తించింది. మిగిలిన 14 వజ్రాల కోసం కూడా వెతికి త్వరలోనే కనుగొంటామని విచారణాధికారి వెల్లడించారు. ఎంతో విశాలంగా ఉండే ఈ ఆలయంలోని నాలుగు నేలమాళిగల్లో కొన్నేళ్ల క్రితం వందల కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, పాత్రలు, ఇతర నగలు, అమూల్యమైన రాళ్లు బయటపడి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవడం తెలిసిందే.