
సీతారామ్ ఏచూరికే మళ్లీ పట్టం?
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సరికొత్త ఆఫర్‌తో సీపీఎం ఇరకాటంలో పడింది.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సరికొత్త ఆఫర్‌తో సీపీఎం ఇరకాటంలో పడింది. పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు మూడోసారి పోటీ చేయాల్సిందిగా పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరిని కాంగ్రెస్ పార్టీ కోరింది. ఏచూరిని కాకుండా సీపీఎం నుంచి మరొక అభ్యర్థిని నిలబెడతామంటే ఒప్పుకోబోమని, సీటును వదులుకోవాల్సిందేనని ఏచూరిని రాహుల్ గాంధీ స్వయంగా కలుసుకొని స్పష్టం చేసినట్లు తెల్సింది.
అయితే, ఏచూరి మళ్లీ పోటీ చేయడానికి ఒక ఇబ్బంది ఉంది. ఒక వ్యక్తిని రెండుసార్లకు మించి రాజ్యసభకు పోటీ పెట్టరాదనేది సీపీఎం నియమం. పశ్చిమ బెంగాల్ నుంచి పార్టీకి ప్రాతినిధ్యం కావాలనుకుంటే ఈ నియమాన్ని ఉల్లంఘించక తప్పదు. లేదంటే ఆ సీటుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అంగీకరించాల్సి ఉంటుంది. బెంగాల్ నుంచి సీతారామ్ ఏచూరితో పాటు మరో ఐదుగురు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారందరి సభ్యత్వం ఆగస్టు నెలతో ముగుస్తుంది.
కాంగ్రెస్ పార్టీకి బెంగాల్ అసెంబ్లీలో 44 స్థానాలు, మిత్రపక్షాలను కలపుకొని సీపీఎంకు 32 స్థానాలు ఉన్నాయి. ఈ రెండు పార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్థిని నిలబెడితేనే ఆ అభ్యర్థి గెలుస్తారు. రెండు పార్టీలు ఇద్దరిని నిలబెడితే ఆరో సీటు కూడా తృణమూల్ కాంగ్రెస్‌కే లభిస్తుంది. పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న వ్యక్తి పార్లమెంటులో కూడా పార్టీకి నాయకత్వం వహించకూడదు. ఇప్పటికే ఈ నియమాన్ని ఏచూరి ఉల్లంఘించారు. ఇప్పుడు మూడోసారి రాజ్యసభకు పోటీ చేస్తే ఆ నియమాన్ని కూడా ఉల్లంఘించినట్లు అవుతుందన్నది పార్టీ వర్గాల తర్జనభర్జన. ఓ నిబంధన ఒకసారి ఉల్లంఘించినప్పుడు మరోసారి ఉల్లంఘించడంలో తప్పేముందని కొత్తమంది రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మరి సీపీఎం జాతీయ కార్యవర్గం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.