
'అద్వానీ రాజీనామా చేశారు.. జైట్లీ చేస్తారా?'
న్యూఢిల్లీ: హవాలా కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ కడిగిన ముత్యంలా కేసు నుంచి బయటపడ్డారని, ఇప్పుడు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కూడా డీడీసీఏ వివాదం నుంచి బయపడతారనే నమ్మకముందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పందించారు. హవాలా కుంభకోణంలో ఆరోపణలు వచ్చిన వెంటనే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న అద్వానీ ఎంపీ పదవికి రాజీనామా చేశారని ఏచూరి గుర్తు చేశారు. అద్వానీని ఆదర్శంగా తీసుకుని రాజీనామా చేయాల్సిందిగా ప్రధాని మోదీ.. జైట్లీని ఆదేశిస్తారా? అని ఏచూరి ప్రశ్నించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఇదే విషయంపై మాట్లాడుతూ అద్వానీ మాదిరిగా జైట్లీ రాజీనామా చేస్తారా అని వ్యాఖ్యానించారు. అద్వానీ, జైట్లీ ప్రాధాన్యాలు వేరని దిగ్విజయ్ చెప్పారు.
డీడీసీఏ కుంభకోణంలో అరుణ్ జైట్లీపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, జైట్లీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. జైట్లీ.. కేజ్రీవాల్తో పాటు ఆప్ నేతలపై పరువునష్టం దావా వేశారు.