తప్పుకుంటారా, తప్పిస్తారా?
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎదురుదాడి మరింత ఉధృతం చేశారు. డీడీసీఏలో నిధుల అవకతవకల కేసులో విచారణకు జైట్లీ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. జైట్లీపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని ట్విటర్ లో పేర్కొన్నారు. కేంద్ర మంత్రి పదవికి ఆయన రాజీనామా చేయాలి లేదా స్వతంత్ర సంస్థ దర్యాప్తు చేసేందుకు వీలుగా ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.
'తనపై వచ్చిన ఆరోపణలను మీడియా ముఖంగా జైట్లీ తోసిపుచ్చారు. ఇక దీనిపై విచారణ అవసరం లేదన్నట్టుగా ఆయన మాట్లాడారు. మీడియాలో తోసిపుచ్చడం సరిపోతుందనుకున్నప్పుడు 2జీ స్పెక్ట్రమ్ స్కామ్ నిందితులకు కూడా ఇదే వర్తిస్తుందని భావించాల'ని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. డీడీసీఏలో నిధుల అవకతవకలు చాలా సీరియస్ కేసు, వాస్తవాలు బయటకు రావాలంటే సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.