DDCA Case
-
ఆజాద్ పై క్రమశిక్షణ చర్య!
న్యూఢిల్లీ: అరుణ్ జైట్లీని టార్గెట్ చేసిన మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్ పై పార్టీ అధినాయకత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకోనుందని తెలుస్తోంది. ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) నిధుల దుర్వినియోగం వ్యవహారంలో సొంత పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై బహిరంగ ఆరోపణలు చేసి బీజేపీని ఇరుకున పడేశారు ఆజాద్. అంతేకాదు తనపై కేసు పెట్టాలని జైట్లీని సవాల్ చేశారు. అధిష్టానం జైట్లీకి మద్దతు ప్రకటించినా ఆయన వెనక్కు తగ్గలేదు. 13 ఏళ్ల పాటు డీడీసీఏ అధ్యక్షుడిగా పనిచేసిన జైట్లీ హయంలో ఆర్థిక అవకతవకలు జరిగాయని పునరుద్ఘాటించారు. ప్రధాని నరేంద్ర మోదీతో సహా బీజేపీ అగ్రనేతలు జైట్లీని వెనకేసుకొచ్చినా ఆజాద్ మాత్రం తన వాదనకు కట్టుబడ్డారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బుజ్జగించినా లెక్కచేయలేదు. పార్టీకి తలనొప్పిగా మారిన ఆజాద్ పై ఈ రోజు సాయంత్రంలోగా ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
'జైట్లీనేకాదు ఆయన కుటుంబాన్నీ తిట్టారు'
న్యూఢిల్లీ: ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) నిధుల దుర్వినియోగం వ్యవహారంపై ఇంతకుముందే విచారణ జరిగిందని కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ తెలిపారు. ఎటువంటి అక్రమాలు జరగలేదని విచారణలో తేలిందని చెప్పారు. తన ముఖ్యకార్యదర్శిపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పకుండా అసభ్య పదజాలంతో అరవింద్ కేజ్రీవాల్ ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు. అవినీతిపరుడైన అధికారిని దగ్గర పెట్టుకుని అవినీతిరహిత పాలన అందిస్తామని కేజ్రీవాల్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపైనే కాకుండా ఆయన కుటుంబంపైనా అసభ్య పదజాలంతో ఢిల్లీ సీఎం విమర్శలు చేశారని రాథోడ్ ఆరోపించారు. డీడీసీఏ ఆర్థిక అవకతవకల వ్యవహారంలో తనపై ఆరోపణలు చేసిన కేజ్రీవాల్, మరో ఐదుగురు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై అరుణ్ జైట్లీ పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. -
'నా వల్లే అద్వానీ బయటపడ్డారు'
న్యూఢిల్లీ: హవాలా కేసు నుంచి బీజేపీ సీనియర్ నాయకుడు తన వల్లే బయటపడ్డారని ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ అన్నారు. కేజ్రీవాల్ పై పరువునష్టం దావా కేసులో అరుణ్ జైట్లీని తాను ప్రాసిక్యూట్ చేయనున్నానని తెలిపారు. 'హవాలా కేసులో అద్వానీ తరపున రాంజెఠ్మలానీ వాదించాడు. కానీ ఇప్పుడు అరుణ్ జైట్లీని నేను ప్రాసిక్యూట్ చేయనున్నాను. ఇది మీరు తెలుసుకోవాలి' అని జెఠ్మలానీ అన్నారు. హవాలా కేసు నుంచి అద్వానీ బయటిపడినట్టుగానే ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) నిధుల దుర్వినియోగం ఆరోపణల నుంచి జైట్లీ నిష్కళంకంగా బయటపడతారని ప్రధాని మోదీ పేర్కొన్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. జైట్లీని ఇష్టపడను అన్న విషయం రహస్యంగా ఉంచడానికి తాను ప్రయత్నించనని చెప్పారు. ఈ కేసును దూరంగా ఉండాలని బీజేపీ కోరితే ప్రశ్నించగా... జైట్లీ, ఆయన కోటరీ కారణంగానే తాను బీజేపీ నుంచి బహిష్కణకు గురైయ్యానని, అయినప్పటికీ నరేంద్ర మోదీ కేంద్రంలో అధికారంలోకి రావడానికి కృషి చేశానని సమాధానమిచ్చారు. డీడీసీఏ వ్యవహారంలో విచారణ కమిటీ వేసే అధికారం ఢిల్లీ ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు. -
కేజ్రీవాల్ కు హైకోర్టు నోటీసు
న్యూఢిల్లీ: ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) వివాదంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టు మంగళవారం నోటీసు జారీచేసింది. కేజ్రీవాల్ తో పాటు ఐదుగురు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కుమార్ విశ్వాస్, సింజయ్ సింగ్, అశుతోష్, రాఘవ చద్దా, దీపక్ వాజపేయిలకు నోటీసులిచ్చింది. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పరువునష్టం దాఖలు చేసిన నేపథ్యంలో ఈ నోటీసులిచ్చింది. మూడు వారాల్లోగా సమాధానాలు ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది. డీడీసీఏ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని తనపై ఆరోపణలు చేయడంతో కేజ్రీవాల్, ఆప్ నేతలపై రూ. పది కోట్లకు పాటియాలా హౌస్ కోర్టులో అరుణ్ జైట్లీ సివిల్, క్రిమినల్ పరువు నష్టం దావాలను వేశారు. వారం క్రితం కేజ్రీవాల్ ఆఫీసులో ఆయన ముఖ్య కార్యదర్శిపై సీబీఐ దాడులు చేయడంతో వివాదం చెలరేగింది. డీడీసీఏకి జైట్లీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు అనేక అక్రమాలకు పాల్పడ్డారని, దీనికి సంబంధించిన ఫైలు కోసమే సీబీఐ సీఎంవోలో సోదాలు జరిపిందని ఆప్ నేతలు ఆరోపించడం తెలిసిందే. -
కేజ్రీవాల్ పై జైట్లీ పరువునష్టం దావా!
న్యూఢిల్లీ: ఢిల్లీ, డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మధ్య పోరాటం సాగుతోంది. తనతో పాటు తనకుటుంబ సభ్యులపై అసత్య ఆరోపణలు చేసిన కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకులు కుమార్ విశ్వాస్, అశుతోష్, సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, దీపక్ వాజపేయిలపై సోమవారం పరువునష్టం దావా వేయనున్నట్టు జైట్లీ వెల్లడించారు. వ్యక్తిగత హోదాలోనే కేసు పెట్టనున్నట్టు తెలిపారు. కాగా, డీడీసీఏ ఆర్థిక అవకతవకలపై విచారణకు కేజ్రీవాల్ ఆదేశించారు. గోపాల సుబ్రహ్మణ్యం నేతృత్వంలో కమిటీ విచారణ చేపట్టనుందని కేజ్రీవాల్ తెలిపారు. కేజ్రీవాల్, జైట్లీ వ్యూహప్రతివ్యూహాలతో హస్తినలో రాజకీయాలు వేడెక్కాయి. -
తప్పుకుంటారా, తప్పిస్తారా?
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎదురుదాడి మరింత ఉధృతం చేశారు. డీడీసీఏలో నిధుల అవకతవకల కేసులో విచారణకు జైట్లీ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. జైట్లీపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని ట్విటర్ లో పేర్కొన్నారు. కేంద్ర మంత్రి పదవికి ఆయన రాజీనామా చేయాలి లేదా స్వతంత్ర సంస్థ దర్యాప్తు చేసేందుకు వీలుగా ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. 'తనపై వచ్చిన ఆరోపణలను మీడియా ముఖంగా జైట్లీ తోసిపుచ్చారు. ఇక దీనిపై విచారణ అవసరం లేదన్నట్టుగా ఆయన మాట్లాడారు. మీడియాలో తోసిపుచ్చడం సరిపోతుందనుకున్నప్పుడు 2జీ స్పెక్ట్రమ్ స్కామ్ నిందితులకు కూడా ఇదే వర్తిస్తుందని భావించాల'ని కేజ్రీవాల్ పేర్కొన్నారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. డీడీసీఏలో నిధుల అవకతవకలు చాలా సీరియస్ కేసు, వాస్తవాలు బయటకు రావాలంటే సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.