ఆజాద్ పై క్రమశిక్షణ చర్య!
న్యూఢిల్లీ: అరుణ్ జైట్లీని టార్గెట్ చేసిన మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్ పై పార్టీ అధినాయకత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకోనుందని తెలుస్తోంది. ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) నిధుల దుర్వినియోగం వ్యవహారంలో సొంత పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై బహిరంగ ఆరోపణలు చేసి బీజేపీని ఇరుకున పడేశారు ఆజాద్. అంతేకాదు తనపై కేసు పెట్టాలని జైట్లీని సవాల్ చేశారు. అధిష్టానం జైట్లీకి మద్దతు ప్రకటించినా ఆయన వెనక్కు తగ్గలేదు.
13 ఏళ్ల పాటు డీడీసీఏ అధ్యక్షుడిగా పనిచేసిన జైట్లీ హయంలో ఆర్థిక అవకతవకలు జరిగాయని పునరుద్ఘాటించారు. ప్రధాని నరేంద్ర మోదీతో సహా బీజేపీ అగ్రనేతలు జైట్లీని వెనకేసుకొచ్చినా ఆజాద్ మాత్రం తన వాదనకు కట్టుబడ్డారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బుజ్జగించినా లెక్కచేయలేదు. పార్టీకి తలనొప్పిగా మారిన ఆజాద్ పై ఈ రోజు సాయంత్రంలోగా ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.