
'జైట్లీనేకాదు ఆయన కుటుంబాన్నీ తిట్టారు'
అరుణ్ జైట్లీపైనే కాకుండా ఆయన కుటుంబంపైనా అసభ్య పదజాలంతో ఢిల్లీ సీఎం విమర్శలు చేశారని రాథోడ్ ఆరోపించారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) నిధుల దుర్వినియోగం వ్యవహారంపై ఇంతకుముందే విచారణ జరిగిందని కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ తెలిపారు. ఎటువంటి అక్రమాలు జరగలేదని విచారణలో తేలిందని చెప్పారు. తన ముఖ్యకార్యదర్శిపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పకుండా అసభ్య పదజాలంతో అరవింద్ కేజ్రీవాల్ ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు. అవినీతిపరుడైన అధికారిని దగ్గర పెట్టుకుని అవినీతిరహిత పాలన అందిస్తామని కేజ్రీవాల్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపైనే కాకుండా ఆయన కుటుంబంపైనా అసభ్య పదజాలంతో ఢిల్లీ సీఎం విమర్శలు చేశారని రాథోడ్ ఆరోపించారు. డీడీసీఏ ఆర్థిక అవకతవకల వ్యవహారంలో తనపై ఆరోపణలు చేసిన కేజ్రీవాల్, మరో ఐదుగురు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై అరుణ్ జైట్లీ పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.