నైపుణ్యాభివృద్ధి అవసరం
- పోలీసులు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి
- డీజీపీ, ఐజీపీల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ
- విధి నిర్వహణలో ప్రతిభ చూపిన
- నిఘా అధికారులకు పతకాలు ప్రదానం
- ‘మీకు అందుబాటులో భారత పోలీసులు’ యాప్ ఆవిష్కరణ
- సాయంత్రం ఢిల్లీకి తిరిగి వెళ్లిన మోదీ
- గంటన్నర పాటు నిరీక్షించిన గవర్నర్, సీఎం
- ప్రధానితో పది నిమిషాలు చర్చ.. ఘనంగా వీడ్కోలు
సాక్షి, హైదరాబాద్: పోలీసులు చురుకైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాల్సి ఉందని, శిక్షణలో భాగంగా ఈ ప్రక్రియ జరగాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మానవ మనస్తత్వం, ప్రవర్తనా మనోవిజ్ఞాన నైపుణ్యం శిక్షణలో కీలకాంశాలుగా ఉండాలని చెప్పారు. వాటితోపాటు నాయకత్వ నైపుణ్య స ముపార్జన ఎంతో ప్రధానమని, పోలీసు సిబ్బందిలో ఈ నైపుణ్యాన్ని పెంపొందించాల్సిన బాధ్యత సీనియర్ అధికారులదేనని స్పష్టం చేశారు. డీజీపీ, ఐజీపీల సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి జాతీయ పోలీసు అకాడమీలో బస చేసిన ఆయన... శనివారం తెల్లవారుజామున యోగాతో తన కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం అకాడమీలో జరిగిన డీజీపీలు, ఐజీపీల వార్షిక సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు.
డీజీపీలు, ఐజీపీల వార్షిక సదస్సు నిర్వహణ విధానంలో గణనీయ మార్పులు చోటు చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అనుభవాలను పంచుకునేందుకు ఇదో చక్కని వేదికగా మారిందని, తద్వారా విధాన రూపకల్పనకు అవసరమైన సమాచారం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. కార్యాచరణలోని అంశాల వారీగా నిర్దిష్ట ఫలితాలు రాబట్టాల్సిన అవసరం ఉందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు మేధస్సు, ప్రత్యక్ష గస్తీకి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. ఉత్తమ శిక్షణ ద్వారా పోలీసు బలగాల్లో గుణాత్మక మార్పు తేవాలని ప్రధాని పిలుపునిచ్చారు.
నిరంతర ప్రగతి కోసం సాంకేతిక పరిజ్ఞానంతో పాటు మానవ సామర్థ్యం మేళవింపు పోలీసు బలగాలకు ఎంతో అవసరమన్నారు. ఈ సందర్భంగా ‘మీకు అందుబాటులో భారత పోలీసులు (Indian Police at Your Call)’అనే యాప్‌ను మోదీ ఆవిష్కరించారు. అనంతరం విధి నిర్వహణలో విశేష ప్రతిభ చూపిన నిఘా విభాగం అధికారులను పోలీసు పతకాలతో సత్కరించారు. అంతకుముందు జాతీయ పోలీసు అకాడమీలోని అమర వీరుల స్మారకం వద్ద ప్రధాని పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి మొక్కను నాటారు.
ముంబై ఉగ్రదాడిని స్మరించుకున్న ప్రధాని
‘‘ఈ రోజు నవంబర్ 26. ముంబై నగరంలో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన రోజు. ఆ ఉగ్ర దాడిని తిప్పికొట్టడంలో పోలీసులు అసమాన ధైర్య సాహసాలు చూపారు. విధి నిర్వహణలో భాగంగా దేశంలో ఇప్పటి వరకు 33 వేల మంది పోలీసులు అమరులయ్యారు..’’అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సదస్సులో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు కిరణ్ రిజిజు, హాన్‌సరాజ్ అహీర్, పోలీసు అకాడమీ డెరైక్టర్ అరుణ బహుగుణ, వివిధ రాష్ట్రాల డీజీపీలు, ఐజీలు పాల్గొన్నారు.
ఘనంగా వీడ్కోలు
డీజీపీల సదస్సులో పాల్గొని, తిరిగి ఢిల్లీకి బయలుదేరిన ప్రధాని మోదీకి శంషాబాద్ విమానాశ్రయంలో ఘనంగా వీడ్కోలు పలికారు. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5.40 గంటలకే మోదీ బయలుదేరాల్సి ఉంది. కానీ ఆలస్యంగా సాయంత్రం 6.45 గంటలకు మోదీ విమానాశ్రయానికి చేరుకున్నారు. మోదీని కలిసేందుకు సాయంత్రం 5.30 గంటలకు ముందే విమానాశ్రయానికి చేరుకున్న సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్, మంత్రులు, నేతలు దాదాపు గంటన్నర పాటు వేచి చూశారు. ప్రధాని రాగానే గవర్నర్, సీఎంలతో పాటు మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు ఈటల, కేటీఆర్, హరీశ్‌రావు, పోచారం, నారుుని, తలసాని, మహేందర్‌రెడ్డి, పద్మారావు, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, కేకే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్యేలు రామచంద్రరావు, రాజాసింగ్, నేతలు నాగం, దినేశ్‌రెడ్డి, సీఎస్ రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ తదితరులు కలిశారు.
10 నిమిషాలు చర్చ!
విమానాశ్రయంలో ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్ దాదాపు 10 నిమిషాల పాటు మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఈ సందర్భంగా ప్రధానికి కేసీఆర్ వివరించినట్లు తెలిసింది. రాష్ట్రంలో కరెన్సీ కొరత తీవ్రంగా ఉందని, వెంటనే బ్యాంకులకు, ఏటీఎంలకు కొత్త నోట్లను సరఫరా చేయాలని కోరినట్లు సమాచారం. నోట్ల రద్దుకు నిరసనగా 28న విపక్షాలు తలపెట్టిన దేశవ్యాప్త బంద్‌కు తాము దూరంగా ఉంటున్నామని ప్రధానికి వివరించినట్లు తెలిసింది. అనంతరం 7.10 గంటల సమయంలో మోదీ వాయుసేన విమానంలోకి ఢిల్లీకి బయలుదేరారు.
భద్రతా లోపాలపై మందలింపు!
శుక్రవారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి ప్రధాని మోదీ వచ్చిన సమయంలో కాన్వాయ్ సమీపం వరకు మీడియాతో పాటు సాధారణ వ్యక్తులు కూడా రావడంపై స్థానిక పోలీసులు, భద్రతాధికారులను ప్రధాని భద్రతా బృందం మందలించినట్లు సమాచారం. వీఐపీ గేటుకు సమీపంలోనే మరో గేటు ఉండడం, అక్కడ ఎలాంటి భద్రత లేకపోవడాన్ని ఎత్తిచూపినట్లు తెలుస్తోంది. దీంతో శనివారం సాయంత్రం పోలీసులు వీఐపీ గేటు సమీపంలోని గేటును పూర్తిగా మూసి వేసి, మీడియాను కూడా లోనికి అనుమతించలేదు.