స్కైప్‌కు ఆధార్ లింక్: మైక్రోసాఫ్ట్
బెంగళూరు: ఇంటర్నెట్ ద్వారా వీడియో కాల్స్, వాయిస్ చాట్‌ను అందించే తమ అప్లికేషన్ స్కైప్‌కు ఆధార్‌ను అనుసంధానించి ప్రభుత్వ పథకాలను సులభతరం చేయడానికి టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సిద్ధమైంది. బెంగళూరులో మైక్రోసాఫ్ట్ భారత విభాగం చైర్మన్ భాస్కర్ ప్రామాణిక్ పీటీఐతో మాట్లాడుతూ.. ఇప్పటికే ఐరిస్ ద్వారా గుర్తించే విధానాన్ని రూపొందించామని, ఇక ఏ విధానం కావాలో నిర్ణయించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు.
ఆధార్ ఆధారిత సేవల్లో ధ్రువీకరణ కోసం తమ స్కైప్‌ను వినియోగించవచ్చని, ఉదాహరణకు బ్యాంకు నుంచి పెన్షన్ పొందేందుకు ఇంటిలో నుంచే స్కైప్ ద్వారా ధ్రువీకరణ ఇవ్వొచ్చని చెప్పారు. డిజిటల్ ఇండియా, ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా కార్యక్రమాల్లో భాగస్వాములయ్యేందుకు ప్రభుత్వంతో కలిసి చురుగ్గా పనిచేస్తున్నామని వెల్లడించారు.