
అమర జవాన్లకు అవమానం
న్యూఢిల్లీ: అమరజవాన్లకు అవమానం జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో అమరులైన సీఆర్‌పీఎఫ్ జవాన్ల యూనిఫారాలు చెత్తకుప్పలో దర్శనమిచ్చాయి. ఈ ఘటనపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. అమరులను అవమానించేవిధంగా ఉన్న ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టాలని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదేశించారు. బాధ్యులను గుర్తించి శిక్షించాలని ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌కు సూచించారు.
ఈ ఎన్‌కౌంటర్‌లో 14 మంది జవాన్లు మృతిచెందడం తెలిసిందే. జవాన్ల మృతదేహాలకు రాయ్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేశారు. అనంతరం జవాన్ల యూనిఫారాలు, బూట్లు ఆసుపత్రి చెత్తకుప్పలో దర్శనమిచ్చాయి. ఈ ఘటనపై శాఖపరమైన విచారణ చేపట్టామని సీఆర్‌పీఎఫ్ తాత్కాలిక అధిపతి ఆర్‌సీ తయాల్ చెప్పారు. ఎన్‌కౌంటర్ కేసును నమోదు చేసుకున్న స్థానిక పోలీసుల అధీనంలో అమర జవాన్ల యూనిఫారాలు ఉండాలన్నారు. శవపరీక్షల అనంతరం ఆసుపత్రి సిబ్బంది వీటిని వ్యర్థ పదార్థాలుగా భావించి పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. కాని అమరులకు సంబంధించిన ఏ వస్తువునైనా భద్రపర్చాలని కేంద్రహోంమంత్రి ఇదివరకే ప్రకటించారని చెప్పారు.