
ఇక రైలు ప్రయాణం ఇంట్లో కూర్చున్నట్లే !
న్యూఢిల్లీ: మున్మందు రైల్వే ప్రయాణం మరింత సుఖవంతంగా మారనుంది. మునుపెన్నడు లేని సౌకర్యాలు రైలు బోగీల్లో అందుబాటులోకి రానున్నాయి. కొత్తగా స్మార్ట్ కోచ్లను తీర్చిదిద్దుతున్నారు. ఇవి పూర్తయి వినియోగంలోకి వస్తే అచ్చం ఇంట్లో ఎలాంటి సౌకర్యాలు అందుతాయో అలాంటివి వీటిల్లోను లభ్యం కానున్నాయి. ఈ స్మార్ట్ బోగీల్లో ఉండే సౌకర్యాలు పరిశీలిస్తే ప్రస్తుతం ఉన్న సీటింగ్ సిస్టం కన్నా అత్యాధునిక పరికరాలతో సీట్లు తయారు చేయనున్నారు.
జీపీఎస్, వైఫైవంటి సౌకర్యాలతోపాటు నిద్రనుంచి మేల్కొనెలా అలారం గడియారాలు, ఎల్ఈడీ ఆధారిత రిజర్వేషన్ నోటీసు బోర్డులు, బెర్త్ ఇండికేటర్స్, విమానాల్లో ఏర్పాటుచేసినట్లుగా ప్రయాణికుడి పూర్తి సమాచారంతోపాటు ఆడియో రూపంలో ఎనౌన్స్ మెంట్ కూడా చేయడం జరుగుతుంది. దీంతోపాటు టీ, హాట్ వాటర్, కాఫీవంటి పానియాలకోసం ప్రత్యేకంగా వెండింగ్ మెషిన్ కూడా ఉండనుంది. దీంతోపాటు ప్రతిఒక్క ప్రయాణికుడికి ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ చార్జింగ్ పాయింట్లు అందుబాటులోకి తీసుకురానున్నారు. సీసీటీవీ నిఘా కూడా ప్రవేశపెట్టనున్నారు. ఈ కోచ్ల నిర్మాణం ప్రతిపాదనలు ఈ రైల్వే బడ్జెట్లోనే ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.