రాహుల్పై నిప్పులు చెరిగిన స్మృతి
న్యూఢిల్లీ: నోట్ల రద్దు విషయంలో ప్రధాని నరేంద్రమోదీ అసమర్థుడిగా మిగిలారన్న ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. 2జీ కుంభకోణం, కామన్‌వెల్త్ క్రీడల్లో అవినీతి, అగస్టా హెలికాప్టర‍్ల కుంభకోణాలు ఇవన్నీసమర్థతకు చిహ్నాలా ?అని స్మృతి నిలదీశారు. దేశానికి అచ్ఛేదిన్ (మంచిరోజులు) 2019 తర్వాతే వస్తాయన్న రాహుల్ వ్యాఖ్యలపై స్పందిస్తూ, దశాబ్దాలుగా సాగిన కాంగ్రెస్ పాలనలో మంచిరోజులే లేవని ఒప్పుకున్నట్లే కదా అని ఆమె ఎద్దేవా చేశారు. ప్రపంచ దేశాల ముందు ప్రధాని దేశాన్ని తలవంచుకునేలా చేశారన్న రాహుల్ కామెంట్‌పై ట్వీటర్‌లో స్పందించారు. బహుశా రాహుల్ పేర్కొన్నది మన్మోహన్ సింగ్ గురించేనేమో ? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
కాంగ్రెస్ జాతీయ స్థాయి సమావేశంలో బుధవారం ప్రసంగించిన రాహుల్ గాంధీ ఆర్‌ఎస్‌ఎస్, ప్రధాని మోదీ దేశంలోని ఆర్థిక సంస్థలను నిర్వీర్యం చేశారని ఆరోపించిన విషయం తెలిసిందే. మోదీ అసమర్థత వల్ల భారత్‌ను ప్రపంచ దేశాల ముందు తలవంచుకునేలా చేశారని రాహుల్ అన్నారు. ఆర్బీఐ గవర్నర్‌ను కీలుబొమ్మగా మార్చివేశారని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.