నిషేధం అన్నారు.. హాయిగా వాడుతున్నారు!
శ్రీనగర్: రాష్ట్రంలో హింసకు కారణమవుతున్న తీవ్రవాదులు, అసాంఘిక శక్తులను నియంత్రించేందుకు జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం నెల రోజులపాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలను బుధవారం నిషేధించింది. నిషేధం అమలులోకి వచ్చినా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో గురువారం హాయిగా మొబైల్స్ లో ఇంటర్నెట్ సేవలను వినియోగించడం స్థానికంగా కలకలం రేపింది. వేర్పాటు వాదులకు ఆసరాగా నిలుస్తున్న 22 సోషల్ వెబ్‌సైట్లను ప్రభుత్వం నిలిపివేసింది. మళ్లీ ఉత్తర్వులు వెలువరించేందాకా ఈ నిషేదాజ్ఞలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసినా నిషేధం ప్రభావం కేవలం బీఎస్ఎన్ఎల్ బ్రాడ్ బ్యాండ్ నెట్ యూజర్లకే వర్తించినట్లు కనిపించింది.
కశ్మీర్ లోయ ఏరియాలో ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్ అప్లికేషన్ల వాడకంపై బీఎస్ఎన్ఎల్ ఉన్నతోద్యోగి స్పందించారు. నిషేధం గురించి తెలుసు కానీ, ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు, ఉత్తర్వులు రాలేదని చెప్పారు. బీఎస్ఎన్ఎల్ ఉన్నతాధికారులతో ఈ విషయాన్ని చర్చించి ఇంటర్నెట్ సేవలు నిషేధిస్తామని పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ మసూద్ బాలా తెలిపారు.
ప్రత్యేకించి నిషేధించిన వెబ్ సైట్లను బ్లాక్ చేయడం తమ వల్ల కాదన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి వివరించినట్లు ఇంటర్నెట్ సర్వీసులు అందిస్తున్న ప్రైవేట్ యాజమాన్యాలు చెబుతున్నాయి. వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్ (వీపీఎన్) ద్వారా యూజర్లు అప్లికేషన్లను యథేచ్చగా వాడుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు.