కోమా నుంచి కోలుకున్న వీర జవాన్
న్యూఢిల్లీ: ఉగ్రవాదుల తూటాలకు ఎదురునిలిచి పోరాడి తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలై కోమాలోకి వెళ్లిన సీఆర్‌పీఎఫ్ కమాండెంట్ చేతన్ కుమార్ చీతా తిరిగి లేచాడు. దాదాపు నెల రోజులపాటు కోమాలో ఉన్న ఆయన వైద్యానికి స్పందించి ప్రాణగండం నుంచి బయటపడ్డాడు. ఈ రోజు సాయంత్రం ఆయనను డిశ్చార్జి చేయనున్నట్లు ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) సీనియర్ వైద్యుడు అమిత్ గుప్తా తెలిపారు.
చేతన్ మెదడుకు పలు చోట్ల గాయాలు అయ్యాయని, మెదడులో పలుచోట్ల నిలిచిపోయిన వ్యర్థాలను తొలగించామని ప్రస్తుతానికి అతడు ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు వెల్లడించారు. గత ఫిబ్రవరి 14న బందిపోరా జిల్లాలోని హజిన్ ప్రాంతంలో ఉగ్రవాదులకు భారత సీఆర్‌పీఎఫ్ బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలుకోల్పోగా చేతన్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో కోమాలోకి వెళ్లాడు. అతడి కంటికి, దవడకు, చేతికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి.