రాహుల్‌ను పక్కనపెట్టే కుట్ర: బేణీ ప్రసాద్ వర్మ
లక్నో: కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబాన్ని ముఖ్యంగా పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని పక్కన పెట్టేందుకు కొందరు సొంత పార్టీ నేతలే ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బేణీ ప్రసాద్ వర్మ సోమవారం ఆరోపించారు. ఇతర పార్టీలతో సంబంధాలు పెట్టుకున్న కొందరు నేతలు కావాలనే ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని, ఇటీవలి ఎన్నికల్లో వారు పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని.. ప్రత్యేకంగా ఎవరి పేరునూ ప్రస్తావించకుండా ఆయన విమర్శించారు. ఎన్నికల్లో టికెట్లను అమ్ముకుని, కోట్లాది రూపాయలు సంపాదించి.. ఇప్పుడు అధినాయకత్వాన్ని విమర్శిస్తున్న వారెవరో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. దేశంలో మోడీకి దీటైన నేత రాహుల్ గాంధేనంటూ పార్టీ ఉపాధ్యక్షుడిపై బేణీ ప్రశంసలు గుప్పించారు.