`రాహుల్ గాంధీయే కాంగ్రెస్ ప్రధానమంత్రి అభ్యర్ధి`
న్యూఢిల్లీ: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీయే కాంగ్రెస్ ప్రధాన మంత్రి అభ్యర్థి అని కేంద్రమంత్రి బేణీ ప్రసాద్ వర్మ వ్యాఖ్యానించారు. గురువారం ఇక్కడ న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ... రాహుల్ గాంధీయే దేశానికి కాబోయే ప్రధానమంత్రి అని, ఆయన తరువాత మరో నాయకుడు లేడని చెప్పారు. అంతకముందు నందన్ నీలేకని పేరు ప్రధాని అభ్యర్ధిగా వినిపించిన నేపథ్యంలో కాంగ్రెస్ బుధవారం తిరస్కరించి ఊహాత్మక చర్చగా పరిగణించినట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానమంత్రి అభ్యర్ధిత్వం విషయంలో రాహుల్ గాంధీ పేరునే సోనియా గాంధీ పరిశీలనలో ఉంచినట్టు ఆదివారం ఊహాగానాలు వినిపించాయి. సెప్టెంబర్ లో నందన్ నీలేకని కాంగ్రెస్ లో చేరుతున్నారని, ఆయన 2014లో బెంగళూరు నుంచి లోకసభ ఎన్నికల్లో పోటీచేస్తున్నట్టు కథనాలు వినిపించాయి. అయితే ఇదంతా కాంగ్రెస్ నడిపించిన లీకుల రాజకీయంలో భాగమేనని కూడా విమర్శలు వచ్చాయి. తాజాగా బేణీ ప్రసాద్ వర్మ వ్యాఖ్యలతో రాహుల్ గాంధీని కాంగ్రెస్ ప్రమోట్ చేస్తోందన్న విషయం మరోసారి నిరూపితమైంది.