
బెంగళూరు: ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేష్ హత్యకు గురైన తర్వాత వాడుకలో లేని ఆమె ఫేస్‌బుక్ అకౌంట్ మంగళవారం తెరుచుకుంది. ఎవరో లాగిన్ అయి గంటలకొద్దీ ఆన్‌లైన్‌లోనే ఉన్న ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. సెప్టెంబరు 5న బెంగళూరులో గౌరీ లంకేష్‌ను కొందరు దుండగుల కాల్చిచంపిన విషయం తెలిసిందే. ఆ రోజు నుంచి ఆమె ఫేస్‌బుక్ ఖాతా ఆగిపోయింది. అయితే మంగళవారం ఉదయం పది గంటలకు ఆ ఫేస్‌బుక్ ఖాతాను ఎవరో లాగిన్ అయ్యారు. ఆ రోజు రాత్రి ఎనిమిది గంటల వరకూ ఓపెన్‌లో ఉన్నట్లు తెలిసింది. ఎవరు చేసి ఈ పని ఉంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
హత్య కేసును దర్యాప్తు చేస్తున్న ‘సిట్’ అధికారి డీసీపీ అనుచేతన్ దీనిపై స్పందిస్తూ..‘ గౌరీ లంకేష్ ఫేస్‌బుక్ అకౌంట్ లాగిన్ అయిన విషయం తెలిసింది. ఒకవేళ మాకు ఫేస్‌బుక్‌లో సమాచారం కావాలని భావిస్తే ఆ సంస్థను సంప్రదించి పాస్‌వర్డ్‌ను కనుగొంటాం. ఇప్పటివరకూ మేం కూడా ఈ ఖాతాను ఓపెన్ చేయలేదు. తాజా ఘటనపై విచారణ జరుపుతాం. ఫేస్‌బుక్ లాగిన్ అయినంత మాత్రాన దర్యాప్తునకు ఎలాంటి ఆటంకం కలగద’ ని పేర్కొన్నారు.
గౌరీ లంకేష్ సోదరి కవితా లంకేష్ స్పందిస్తూ.. ఆమె సన్నిహితులు ముగ్గురు నలుగురికి పాస్‌వర్డ్ తెలుసన్నారు. అయితే ఎవరు లాగ్‌ఇన్ అయ్యారో తెలియదన్నారు. ఎవరైనా ఆమె ఫేస్‌బుక్ ఖాతాను హ్యాక్ చేసి ఉంటారనే అనుమానం కూడా వ్యక్తం చేశారు. సమాచారాన్ని తస్కరించడానికి, లేదా చెరిపివేయడానికి ఎవరైనా దుండగులు హ్యాక్ చేసి ఉంటారన్న వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి.