భోపాల్: కరోనా మహమ్మారి విజృంభణతో చేటు కాలం దాపురించింది. కోవిడ్-19 సోకి చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు అయినవారు కూడా భయపడేంత దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. కరోనాతో చనిపోయిన తండ్రికి అంతిమ సంస్కారాలు చేసేందుకు కొడుకు నిరాకరించిన విదారక ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో వెలుగు చూసింది. స్థానిక తహశీల్దార్ గులాబ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రేమ్ సింగ్ అనే వ్యక్తి కోవిడ్ సోకి ఈనెల 20న మృతి చెందాడు. హిందూ సంప్రదాయం ప్రకారం అతడికి అంత్యక్రియలు నిర్వహించాలని భార్య, కుమారుడు, తోడల్లుడు అనుకున్నారు. తర్వాత ఏమైందో వారు వెనుకడుగు వేశారు. (‘కోట’ నుంచి విద్యార్థులను తీసుకొచ్చినట్టుగా..)
‘వ్యక్తిగత రక్షణ పరికరాలు(పీపీఈ) ధరించి అంతిమ సంస్కారాలు నిర్వహించాలని ప్రేమ్ సింగ్ కుమారుడికి నచ్చజెప్పినా అతడు ముందుకు రాలేదు. కరోనా వైరస్ సోకుతుందన్న భయంతో అతడు వెనుకడుగు వేశాడు. ప్రేమ్ సింగ్ భార్య కూడా కొడుకు నిర్ణయాన్ని సమర్థించింది. చేసేది లేక కొంత మంది సాయంతో మేమే అంత్యక్రియలు నిర్వహించాం. ఆ సమయంలో ప్రేమసింగ్ కుటుంబ సభ్యులు శ్మశానంలోనే దూరంగా నిలుచున్నారు. వారి ఆచార వ్యవహారాల ప్రకారమే అంత్యక్రియలు పూర్తి చేశాం. కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రజలకు అవగాహన లేకపోవడం వల్లే ఇలా జరుగుతోంద’ని తహశీల్దార్ గులాబ్ సింగ్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. కోవిడ్-19 సోకి ఎవరైనా మరణిస్తే శవాన్ని చూసేందుకు స్నేహితులు, కుటుంబ సభ్యులు చూసేందుకు అనుమతి ఉంది. అయితే మృతదేహాన్ని తాకడం, హత్తుకోవడం, ముద్దుపెట్టడం వంటివి చేయరాదు.
ఇది చదవండి: క్వారంటైన్ రుణం తీర్చుకున్నారు.. ఇలా!
Comments
Please login to add a commentAdd a comment