నాడు అధికారమంతా ఆమెదే!
యూపీఏ హయాంలో రాజ్యాంగేతర శక్తిగా సోనియా
రాజ్యాంగ వ్యవస్థలను పక్కనబెట్టి పెత్తనం చేశారు
{పధాని మోదీ నిశిత ఆరోపణలు
{పోగ్రెస్‌కు వ్యతిరేక పదం కాంగ్రెస్
ఏడాదిగా స్కామ్‌ల్లేవు; ఇవి అచ్ఛేదిన్ కావా?
న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి కార్యాలయంపై వాస్తవ అధికారాలను ఆమే చెలాయించారని ఆరోపించారు. పార్లమెంట్లో ఎన్డీయే ప్రభుత్వం అహంకార పూరిత మొండితనం ప్రదర్శిస్తోందని, ఒకే వ్యక్తి కేంద్రంగా నడుస్తున్న ప్రభుత్వం ఇదని సోనియా చేసిన ఆరోపణలను మోదీ తిప్పి కొట్టారు. ‘‘రాజ్యాంగేతర శక్తులే నిజమైన అధికారం చెలాయించిన గత ప్రభుత్వ హయాం నాటి విషయాన్ని ఆమె ప్రస్తావించారు కాబోలు. ఇప్పుడు అధికారం రాజ్యాంగబద్ధ శక్తుల చేతుల్లో మాత్రమే ఉందన్నది నిజం. ‘రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తున్నారు.. రాజ్యాంగేతర శక్తుల మాట వినట్లేదు’ అనేదే మాపై ఆమె ఆరోపణ అయితే.. ఆమెకు మా క్షమాపణలు’’ అంటూ చురకలంటించారు. ప్రతిపక్ష నేత సోనియాపై మోదీ ప్రత్యక్షంగా, తీవ్రస్థాయిలో ఆరోపణాస్త్రాలు సంధించడం అధికారంలోకి వచ్చాక బహుశా ఇదే తొలిసారి. సోనియా, రాహుల్‌లపై నిశిత విమర్శలతో పాటు పలు అంశాలపై ఆయన బుధవారం పీటీఐ వార్తాసంస్థకుఇంటర్వ్యూ ఇచ్చారు. తమపై వచ్చిన ఆరోపణలు సహా వివిధ అంశాలపై మోదీ సమాధానాలు ఆయన మాటల్లోనే..
అధికారమంతా పీఎంఓలో ఉందనడంపై
‘రాజ్యాంగేతర అధికార కేంద్రాలు రాజ్యాంగబద్ధ వ్యవస్థైన ప్రధాని కార్యాలయం(పీఎంఓ) పై అధికారం చెలాయించిన సమయంలో ఈ ప్రశ్న మీరు వారినడిగుంటే బావుండేది. ప్రధాని, పీఎంఓ.. ఈ రెండు రాజ్యాంగం వెలుపలి అధికార కేంద్రాలు కావు. అవి రాజ్యాంగ వ్యవస్థలో భాగం. మేం అధికారంలోకి వచ్చాక శాఖలవారీగా అధికారాలను బదలాయించాం. దాంతో గతంలో కేబినెట్టో లేక ప్రధానమంత్రో తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు శాఖల స్థాయిలోనే తీసుకునే పరిస్థితి నెలకొంది. మంత్రిత్వశాఖల ఆర్థిక స్వాతంత్య్రాన్ని మూడురెట్లు పెంచాం. రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు ఇచ్చాం. ప్రభుత్వ విధానాల్లో మేమేం మార్పులు చేయలేదు. ఏ నిర్ణయం ఎవరు తీసుకోవాలో వారే తీసుకునేలా వ్యవస్థలో మార్పు తెచ్చాం’
వ్యవసాయ సంక్షోభంపై..
‘చాన్నాళ్లుగా ఈ ఆందోళనకర సమస్యను ఎదుర్కొంటున్నాం. రాజకీయ లబ్ది కోసం ఆలోచిస్తే ఈ సమస్యకు పరిష్కారం సాధ్యం కాదు. అన్నదాతల సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో ఈ ప్రభుత్వం ఎన్నడూ వెనకడుగు వేయబోదని నేను రైతులకు హామీ ఇస్తున్నా. రైతులకు సంతృప్తి, భద్రత కలిగించేందుకు అవసరమైన సూచనలివ్వమని నేను అన్ని పార్టీలను కోరాను.
మైనారిటీలపై దాడులపై.. ‘ఈ దేశంలో ఏ వ్యక్తిపై కానీ, సంస్థపై కానీ ఎవరైనా సరే నేరపూరిత చర్యకు పాల్పడటాన్ని కచ్చితంగా ఖండించాల్సిందే. అలా దాడులకు దిగేవారికి చట్టప్రకారం కచ్చితంగా శిక్ష పడాల్సిందే. ఏ మతంపై, లేదా వర్గంపై వివక్ష చూపడాన్ని, హింసకు పాల్పడటాన్ని సహించబోమని గతంలోనూ చెప్పా. మళ్లీ చెబుతున్నా’
ఎన్జీవోలకు వ్యతిరేకంగా చేపట్టిన చర్యలపై
‘గత ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాల ఆధారంగానే తప్పులకు పాల్పడిన స్వచ్ఛంద సంస్థలపై చర్యలు తీసుకున్నాం. చట్ట వ్యతిరేకంగా ఏ చర్యా చేపట్టలేదు. దేశభక్తుడైన ఏ భారతీయుడూ మా చర్యను తప్పుబట్టడు’ భవిష్యత్ కార్యాచరణ..‘ఇకపై రైతులు, పట్టణ పేదలు, మహిళలు, నిరుద్యోగిత.. ఈ అంశాలపై దృష్టి పెడతాం. ఈ ఏడాదిలో మేం చేపట్టిన కార్యక్రమాలను గ్రామాలు, మున్సిపాలిటీల స్థాయికి తీసుకువెళ్తాం’
అధికార వ్యవస్థపై..‘మేం పాలన చేపట్టేనాటికి అధికార వ్యవస్థ నైతికస్థైర్యం కోల్పోయి ఉంది. నిర్ణయాలు తీసుకోవడానికి భయపడే పరిస్థితి ఉంది. వారిలో విశ్వాసం నెలకొల్పడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. కేబినెట్ వ్యవస్థా రాజ్యాంగేతర శక్తులు, మంత్రుల్లో గ్రూపులతో నిస్పృహలో ఉంది. ఆ పరిస్థితిని మార్చి ఉత్సాహ వాతావరణం నెలకొల్పాం.
అధికార కేంద్రాల గురించి..
‘మేం అధికారంలోకి వచ్చే సమయానికి ఢిల్లీలో అధికార కార్యాలయాలన్నీ లాబీయిస్టులతో నిండిపోయి ఉన్నాయి. ఆ వ్యవస్థను నిర్మూలించేందుకు చాలా సమయమే పట్టింది. కానీ సుపరిపాలనకు అది చాలా అవసరం’.
వరుస విదేశీ పర్యటనలపై..
‘పొరుగుదేశం నేపాల్‌కు 17 ఏళ్ల పాటు ఏ ఒక్క ప్రధానీ వెళ్లకపోవడం సరైన విధానం కాదు. మనది పెద్ద దేశమైనంత మాత్రాన అహంకారంతో, నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. ఇప్పుడు అంతర్జాతీయంగా ఉన్న వాతావరణం వేరు. డబ్ల్యూటీవో లాంటి అంతర్జాతీయ సంస్థల సదస్సుల్లో జరిగే ఒప్పందాలను మనమూ ఆమోదించక తప్పని పరిస్థితి.ఆ సదస్సుల్లో మనం పాల్గొనకపోతే మన వాదన వినిపించే అవకాశ ముండదు. అంతర్జాతీయీకరణ చెందిన ఉగ్రవాదం ఏ చిన్న దేశం నుంచైనా మొదలుకావచ్చు. నా విదేశీ పర్యటనలను విమర్శిస్తోంది విపక్ష నేతలు మాత్రమే. ఇటీవలి సర్వేల్లో ప్రజలంతా నా విదేశాంగ విధానానికే పట్టం కట్టారు’
భూ సేకరణ బిల్లుపై..
‘రాజకీయ బురద జల్లుడు కార్యక్రమంలోకి నేను దిగదల్చుకోలేదు. భూ సేకరణ అనేది నిజానికి రాష్ట్రాల పరిధిలోని అంశం. భూములపై అన్ని హక్కులు రాష్ట్రాలకే ఉంటాయి. కేంద్రానికి భూమితో అవసరం లేదు. 120 ఏళ్ల భూ సేకరణ చట్టానికి గత ప్రభుత్వం కనీసం 120 నిమిషాలు కూడా పార్లమెంట్లో చర్చ జరపకుండానే సవరణలు చేసింది. రైతులకు ఉపయోగకరమేనని భావించి మేమూ అప్పుడు మద్దతిచ్చాం. తర్వాత రాష్ట్రాల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయి. తప్పులు సరిచేయడంలో అహంభావంతో వ్యవహరించడం సరికాదు. అందుకే గత ప్రభుత్వ తప్పుల్ని సవరిస్తూ మళ్లీ బిల్లును రూపొందించాం. మా ప్రతిపాదనలను రాజకీయాలను పక్కనబెట్టి పరిశీలించినవారు మాకు పూర్తి మద్దతిస్తారు. గ్రామం, రైతు, పేద.. వీరికి ఉపయోగపడే సూచనలు ఎవరిచ్చినా స్వీకరిస్తాం. రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పుడు భూ సేకరణ చట్టంలో సవరణలు అవసరమని కోరిన పార్టీలే.. ఇప్పుడు ఆ బిల్లును వ్యతిరేకించడం నాకు అర్థంకాని విషయం’
సూటు, బూటు విమర్శలపై..
‘ఏడాది గడచినా లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమిని కాంగ్రెస్ ఇంకా మర్చిపోలేకపోతోంది. వాళ్ల పాపాలు, తప్పులకు జనం వారిని శిక్షించారు. ఓటమి నుంచైనా వారు గుణపాఠం నేర్చుకుంటారనుకున్నాం. ఇంగ్లిష్‌లో ‘ప్రొ’కు వ్యతిరేకపదం ‘కాన్’. ప్రోగ్రెస్‌కు వ్యతిరేకపదం కాంగ్రెస్ అని గతంలో మేమన్న మాట నిజమని వారి వైఖరితో మళ్లీ స్పష్టమైంది’
‘అచ్ఛే దిన్’పై..
‘ఏడాదిగా ఒక్క అవినీతి స్కామూ లేదు. ఇవి అచ్ఛే దిన్(మంచిరోజులు)కావా? 21వ శతాబ్ది భారత్‌దే కావాలి. కానీ 2004- 2014 మధ్య తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, ఆలోచనలు భారత్‌ను బాగా దెబ్బతీశాయి’