కొడుకుపై గుడ్డిప్రేమతో దేశాన్ని భ్రష్టు పట్టించారు
కొడుకుపై గుడ్డిప్రేమతో దేశాన్ని భ్రష్టు పట్టించారు
Published Mon, Apr 14 2014 1:16 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
సాక్షి, బెంగళూరు: తన కుమారుడిపై గుడ్డి ప్రేమతో సోనియాగాంధీ దేశాన్ని భ్రష్టు పట్టించారని నరేంద్ర మోడీ విమర్శించారు. యూపీఏ ప్రభుత్వాన్ని సోనియా రిమోట్ కంట్రోల్‌తో నడిపించారని ఆరోపించారు. ఆదివారం ఆయన కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్, చిక్కమంగళూరు, హవేరి ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన నిర్వహించారు. యూపీఏ ప్రభుత్వంపై, సోనియా, మన్మోహన్‌లపై విరుచుకుపడ్డారు. ‘‘తన కుమారుడిపై ఒక తల్లి గుడ్డి ప్రేమ దేశాన్ని భ్రష్టు పట్టించింది.. మరి దీనివల్ల ఏమైనా ప్రయోజనం వచ్చిందా? ఆ కుమారుడిని మనం నమ్మకగలమా? అతడిని నమ్మి దేశం బతకగలదా?..’’ అంటూ సోనియా, రాహుల్‌లను పరోక్షంగా విమర్శించారు. ఇక అనుకోకుండా (యాక్సిడెంటల్‌గా) ప్రధాని అయిన మన్మోహన్‌సింగ్ వల్ల దేశ ప్రజలందరికీ ప్రమాదమని వ్యాఖ్యానించారు.
దేవెగౌడకు బిడ్డలా సేవ చేస్తా..: మోడీ ప్రధాని అయితే తాను కర్ణాటక వదిలి వెళ్లిపోతానన్న మాజీ ప్రధాని దేవెగౌడ వ్యాఖ్యలపై స్పందిస్తూ... ‘‘దేవెగౌడజీ మీరు రాజకీయాల్లో కురువృద్ధులు. మీరు నాకు పితృ సమానులు. నేను ప్రధాని అయిన తరువాత మీరు కర్ణాటకలో ఉండలేకపోతే గుజరాత్‌కు రండి. మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలు నేను ఏర్పాటు చేయిస్తా. మీరు అంగీకరిస్తే ఒక బిడ్డలా అన్ని సేవలూ చేయడానికి కూడా నేను సిద్ధం’’ అని మోడీ పేర్కొన్నారు.
భార్యకే ఆశ్రయం ఇవ్వలేదు... దేవెగౌడ: తనను గుజరాత్ రావాలంటూ మోడీ ఆహ్వానించడాన్ని దేవెగౌడ ఎద్దేవా చేశారు. భార్యకే ఆశ్రయం ఇవ్వలేని మోడీ.. తనకేదో ఇస్తారని ఆశించట్లేదని చురకలంటించారు.
Advertisement