
ఇస్రోను పొగుడుతూనే సవాల్ విసిరిన స్పేస్ ఎక్స్
ఒకే రాకెట్ పీఎస్‌ఎల్‌వీ-సీ 37 ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యల్లో ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
న్యూఢిల్లీ: ఒకే రాకెట్ పీఎస్‌ఎల్‌వీ-సీ 37 ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యల్లో ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోపై ప్రశంసల జల్లు కురుస్తోంది. స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు, ఎలాన్ ముస్క్ ఇస్రోను పొగడ్తల్లో ముంచెత్తారు. అదే సమయంలో ఒక సవాలు కూడా విసిరారు. ‘ఇస్రో సాధించిన ఈ ఘనత నిజంగా హాసమ్. బాగా ఆకట్టుకునే విషయం’ అని ఎలాన్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఫ్లాయ్‌డిలిసియస్ అనే ఓ ట్విట్టర్ వినియోగదారుడు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా బదులిచ్చారు.
‘ఇస్రో బృందం నిజంగా భారత్ గర్వంతో తల ఎత్తుకునేలా చేసింది’ అంటూ మరో ట్వీట్ కూడా చేశారు. అతితక్కువ ఖర్చుతోనే అంతరిక్షానికి ఉపగ్రహాలను పంపించడంతోపాటు పునర్వినియోగించగల రాకెట్‌లను ఆయన కంపెనీ తయారు చేస్తోంది. ఆ లక్ష్యంతోనే ఎలాన్ స్పేస్ ఎక్స్‌ను స్థాపించారు. ఇస్రోను పొగడ్తల్లో ముంచెత్తిన ఆయన అనంతరం ఇండియా తమ సామర్థ్యాన్ని నిర్లక్ష్యం చేసుకోదని అనుకుంటున్నానని, తమ సంస్థ నుంచి వెళ్లే రాకెట్ తిరిగి భూమ్మీద కొస్తుందని, అలాంటి సాంకేతిక పరిజ్ఞానం భారత్‌కు పెద్ద సవాలే అని అన్నారు.