(సాక్షి, వెబ్ ప్రత్యేకం) : ఓ మనిషి నూరేళ్లపాటు జీవిస్తే వేడుక.. తన ముందు తరాలకు చెరగని జ్ఞాపకం.. ఓ సినిమా వంద రోజులు ఆడితే నిర్మాతకు కాసుల వర్షం.. అదే ఓ క్రికెట్ ప్లేయర్ సెంచరీ కొడితే అతడి కెరీర్‌లో ఓ రికార్డు... కానీ కరోనా కాలంలో ఆ వందలన్నీ ‘జీరో’లుగా మిగిలిపోయాయి. అయితే వేడుకలను రద్దు చేయించి, థియేటర్లను మూయించేసి, ఆటగాడిని నాలుగు గోడల మధ్య బంధీ చేసిన మహమ్మారి కరోనాను కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్ మాత్రం రేపటితో ‘సెంచరీ’ కొట్టనుంది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా ‘లాక్‌డౌన్’ అమల్లోకి వచ్చి మంగళవారం నాటికి సరిగ్గా వంద రోజులు నిండనున్నాయి. ఈ సందర్భంగా.. వంద రోజుల్లో దేశంలో చోటుచేసుకున్న కీలక పరిణామాలు, వైరస్ వ్యాప్తి కట్టడికై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు, లాక్‌డౌన్ కాలంలో మహమ్మారి విజృంభణ తదితర అంశాలపై సాక్షి డాట్‌కామ్ అందిస్తున్న సమగ్ర కథనం.(‘పస్తులుండటం కంటే పనికి వెళ్లడమే మేలు’)
జనతా కర్ఫ్యూతో మొదలై...!
గతేడాది డిసెంబరులో చైనాలోని వుహాన్ నగరంలో తొలిసారి వెలుగు చూసిన ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరించింది. ఈ క్రమంలో జనవరి 30న భారత్‌లో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. వుహాన్‌లో విద్యనభ్యసిస్తున్న కేరళకు చెందిన ఓ విద్యార్థికి పరీక్షలు నిర్వహించగా కరోనా బారిన పడినట్లు తేలింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వాలు ఎయిర్‌పోర్టుల్లో థర్మల్ స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాయి. వైరస్ ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు పరీక్షలు నిర్వహించాయి. ఈ క్రమంలో మార్చిలో భారత్‌లో తొలి కరోనా మరణం కర్నాటకలో చోటుచేసుకుంది. కలబుర్గికి చెందిన 76 ఏళ్ల వృద్ధుడు ఒకరు సౌదీ అరేబియా నుంచి తిరిగి వచ్చి అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చేరారు. కరోనా అనుమానితుడిగా ఉన్న ఆయన సొంతూరికి వెళ్లిన అనంతరం వైరస్‌తో మృతి చెందినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు కేసుల సంఖ్య కూడా పెరగడంతో ఆందోళనలు వ్యక్తమయ్యాయి.(‘ప్రధాని ప్రశంసించారు.. అది చాలు’)
ఇలాంటి తరుణంలో దేశ ప్రజల్లో ధైర్యం నింపేందుకు, మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు.. కరోనాపై పోరులో ముందుండి నడుస్తున్న ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు ధన్యవాదాలు చెప్పేందుకు ఒకరోజు స్వచ్ఛంద బంద్.. ‘జనతా కర్ఫ్యూ’ పాటించాల్సిందిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మార్చి 22 ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలెవరూ ఇంటి నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో కుగ్రామాల్లోని పూరి గుడిసెల్లో నివసించే పేదల నుంచి వాణిజ్య రాజధాని ముంబైలోని ఆంటిల్లాలో నివసించే ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ వరకు ప్రతీ ఒక్కరూ చప్పట్లు, గంటలు మోగిస్తూ భారత ప్రజల ఐక్యతారాగాన్ని ప్రతిధ్వనింపజేశారు. అలా ప్రధాని జనతా కర్ఫ్యూతో లాక్‌డౌన్‌కు ప్రజలను ముందుగానే సన్నద్ధం చేశారు.
లాక్‌డౌన్ - వివిధ దశలు
సాధారణ పరిభాషలో లాక్‌డౌన్ అంటే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రాకపోకలను నివారించడం అని అర్థం. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను కాపాడుకునేందుకు ప్రభుత్వాలు ప్రివెంటివ్, ఎమర్జెన్సీ అనే రెండు రకాల లాక్‌డౌన్ విధిస్తాయి. ఇక కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో.. వైరస్ నివారణ చర్యల్లో భాగంగా మార్చి 24 అర్ధరాత్రి నుంచి లాక్‌డౌన్ అమల్లోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 వరకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధిస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితులు మినహా ప్రజలకు బయటకు రాకుండా కఠిన నిబంధనలు అమలు చేశారు.
లాక్‌డౌన్ విధించే నాటికి వందల్లోనే నమోదైన కేసుల సంఖ్యలో క్రమక్రమంగా పెరుగుదల నమోదైంది. ముఖ్యంగా వైరస్ వ్యాప్తి నేపథ్యంలోనూ రాజధాని ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌లో జరిగిన తబ్లిగీ జమాత్ సమావేశాలకు వేలాది మంది హాజరుకావడం కలకలం రేపింది. ఢిల్లీకి వెళ్లివచ్చిన వారిలో అత్యధిక మందికి కరోనా సోకినట్లు నిర్దారణ అయిన క్రమంలో ఒక్కసారిగా బాధితుల సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తబ్లిగీలను క్వారంటైన్‌కు తరలించడం సహా పరీక్షల నిర్వహణ వేగవంతం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేశాయి.
ఇలా ఓ వైపు కేసుల సంఖ్య పెరుగుతున్నా... మరోవైపు లాక్‌డౌన్ కారణంగా పేద, మధ్య తరగతి, బడుగు వర్గాల జీవితం దుర్భరంగా మారడం, ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుండటంతో దశలవారీగా లాక్‌డౌన్ ఎత్తివేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ ఏప్రిల్ 3న తొలి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏప్రిల్ 14 తర్వాత ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభించేందుకు.. లాక్‌డౌన్ నిష్క్రమణ వ్యూహంపై సూచనలు చేయాల్సిందిగా కోరారు. ఈ క్రమంలో రోజురోజుకీ కరోనా విజృంభించడం, మరణాల సంఖ్య పెరగడం వంటి అనేక పరిణామాల నేపథ్యంలో నాలుగు సార్లు ఏప్రిల్ 15- మే 3, మే 4- మే 17, మే 18- మే 31, జూన్ 1 -జూన్ 30 లాక్‌డౌన్‌ను పొడిగించారు.
5 లక్షలు దాటిన కేసులు..
వాస్తవానికి ఇతర దేశాలతో పోలిస్తే భారత ప్రభుత్వం దాదాపు 75 రోజులపాటు లాక్‌డౌన్ కట్టుదిట్టంగానే అమలు చేసింది. కానీ నాలుగో విడత లాక్‌డౌన్ మే 18-31 ముగిసిన తర్వాత మాత్రం.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. నిబంధనలు మరింతగా సడలించింది. వివిధ ప్రాంతాల్లోని కంటైన్‌మెంట్ జోన్లలో జూన్ 30 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూనే... జూన్ 8 నుంచి భారీ మినహాయింపులు ఇస్తూ లాక్‌డౌన్ 5.0ను ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూనే.. కరోనా కట్టడి, లాక్‌డౌన్ సడలింపుల విషయంలో రాష్ట్రాలకు సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చని తెలిపింది. ఈ క్రమంలో ఏప్రిల్ తొలి వారంలో దాదాపు 417 జిల్లాలు కరోనా రహితంగా ఉండగా.. జూన్ తొలి వారం నాటికి వీటి సంఖ్య 49కి పడిపోవడం గమనార్హం. అదే విధంగా జూన్ 1 నుంచి 28 వరకు 3,38,324 మంది కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో మరోమారు లాక్‌డౌన్ విధిస్తారనే ప్రచారం జోరందుకోగా.. కరోనా నిర్దారణ పరీక్షల సామర్థ్యం, రికవరీ రేటు పెరుగడం వంటి సానుకూల అంశాల నేపథ్యంలో కేంద్రం జూన్ 30 తర్వాత కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న విషయం సర్వత్రా చర్చనీయాంశమైంది.
వణుకుతున్న రాష్ట్రాలు..
కరోనా ధాటికి అల్లాడుతున్న కరోనా అత్యంత ప్రభావిత రాష్ట్రాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ ఇప్పటి వరకు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. మహారాష్ట్రలో ఇప్పటివరకు దాదాపు లక్షా అరవై వేలు, తమిళనాడులో 82 వేలు, ఢిల్లీలో 80 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మూడు రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా దాదాపు 11 వేల మంది మృత్యువాత పడ్డారు. వీటి తర్వాత స్థానంలో ఉన్న గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలో 20 వేలకు పైగా మంది కరోనా బారిన పడ్డారు. రాజస్తాన్, పశ్చిమ బెంగాల్‌లో 16 వేలు, తెలంగాణ, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో 13 వేలు, ఆంధ్రప్రదేశ్‌లో 12 వేలకు మందికి పైగా కరోనా సోకింది. ఇక తొలి పాజిటివ్ కేసు నమోదైన కేరళలో ఇప్పటివరకు 4 వేల కేసులు నమోదు కాగా.. 22 మంది కోవిడ్‌తో మరణించారు.
లాక్‌డౌన్ పొడిగింపుపై రాష్ట్రాల కసరత్తు
కరోనా మహమ్మారి ధాటికి మహారాష్ట్ర అతలాకుతలమవుతోంది. లక్షన్నరకు పైగా మంది కరోనా బారిన పడటంతో.. జూలై 31 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తూ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇక కరోనా కట్టడి కోసం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటింటి సర్వే నిర్వహించాలని నిర్ణయించగా.. గోవా, ఢిల్లీ, ఒడిశా వంటి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్ విధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అసోంలోని గువాహటిలో ఆదివారం నుంచే లాక్‌డౌన్ అమల్లోకి రాగా.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో మరో రెండు రోజుల్లో లాక్‌డౌన్ విధివిధానాలపై కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.(ఇంటింటి సర్వే.. మరింత కఠినంగా లాక్‌డౌన్)
ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్
కరోనా ధాటికి కుదేలైన ఆర్థిక వ్యవస్థను జవసత్వాలు అందించేందుకు మార్చి 12న కేంద్ర ప్రభుత్వం ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ పథకానికి శ్రీకారం చుట్టింది. భారత ఆర్థిక వ్యవస్థలోని అన్ని వర్గాలకు మేలు చేకూర్చే ఉద్దేశంతో.. అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు.. రూ.20 లక్షల కోట్లతో ఉద్దీపన పథకాన్ని ప్రారంభించింది. భారీ, మధ్య తరహా, చిన్నతరహా పరిశ్రమల వారు, చిన్న వ్యాపారులు, ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు, రైతులు, కూలీలు.. ఇలా అన్ని వర్గాలను ఆదుకునేలా రూపొందించిన ఈ భారీ ప్రత్యేక ప్యాకేజీ దేశ జీడీపీలో దాదాపు 10% ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ.. ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ప్రకటన సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాకేజీ ఇది అని బీజేపీ హర్షం వ్యక్తం చేయగా.. వలస జీవులను ఆదుకునేందుకు మోదీ సర్కారు ఎటువంటి చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. (ఆర్థిక సౌష్టవమే ‘ఆత్మ నిర్భర్’ లక్ష్యం)
మారని వలస బతుకులు
లాక్‌డౌన్ కఠిన నిబంధనల కారణంగా... సొంత రాష్ట్రాల బాట పట్టిన వలస కార్మికుల బతుకులు ఛిద్రమయ్యాయి. మాటలకందని విషాదాలను... అభివృద్ధి చెందుతున్న అసలైన భారత్‌ను ప్రపంచం ముందు సాక్షాత్కరించాయి. భార్యాపిల్లలను సైకిలుపై ఎక్కించుకుని ఓ బాటసారి ప్రయాణం.. పసిగుడ్డును భుజంపై వేసుకుని పచ్చి బాలింత కాలినడక.. పిల్లలను కావడిలో మోస్తూ ఇంటి బాట పట్టిన ఓ తండ్రి.. కన్నకొడుకు కడచూపునకు నోచుకోలేని విధివంచితుడి ఆవేదన.. పేగులు మాడుతున్నా.. కాళ్లు కాలుతున్నా లెక్క చేయక.. కిలోమీటర్ల కొద్ది నడిచిన బాలిక ఇంటికి చేరుకునే కొన్ని గంటల మందు మృత్యువాత పడటం.. ఇలాంటి ఎన్నెన్నో హృదయ విదారక దృశ్యాలను ఆవిష్కరించాయి. అనేక విమర్శల అనంతరం శ్రామిక్ రైళ్లు ఏర్పాటు చేసినా వారి కష్టాలకు కళ్లెం పడలేదు. ఈ నేపథ్యంలో దాతలు, స్వచ్ఛంద సంస్థల సహాయం, ప్రభుత్వాల చొరవతో అనేక పరిణామాల అనంతరం ఎట్టకేలకు స్వస్థలాలకు చేరుకున్న వలస కార్మికులకు ఉపాధి కల్పించేందుకు ఇటీవల కేంద్రం ‘గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ యోజన’ ను ప్రవేశపెట్టింది. రూ. 50వేల కోట్లతో ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, జార్ఖండ్, బిహార్ రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో వలస కూలీలకు 125 రోజులపాటు ఉపాధి కల్పించనుంది.
Comments
Please login to add a commentAdd a comment