మొన్న పోకెమాన్.. నిన్న బ్లూవేల్.. తాజాగా పబ్‌జీ ఉరఫ్ ‘ప్లేయర్ అన్‌నోన్స్ బ్యాటిల్‌గ్రౌండ్’.. దేశంలో ప్రస్తుతం యువతను ప్రత్యేకించి స్కూలు విద్యార్థులను గంగవెర్రులెత్తిస్తున్న ప్రమాదకర ఆన్‌లైన్ మొబైల్ గేమ్ ఇది. ఆత్మహత్యలవైపు ప్రేరేపించిన బ్లూవేల్, పోకెమాన్‌ల స్థాయిలో కాకున్నా పబ్‌జీ విద్యార్థులను హింస, నేరప్రవృత్తి స్వభావంవైపు పురిగొల్పుతోంది. స్కూళ్లు ఎగ్గొట్టి మరీ గంటల తరబడి వారు ఈ ఆటలో మునిగితేలేలా బానిసలుగా మార్చుకుంటోంది. యువతలో వివిధ శారీరక, మానసిక అనారోగ్యాలకు కారణమవుతోంది. – సాక్షి, హైదరాబాద్
ఏమిటీ గేమ్...?
ఇది దక్షిణ కొరియాకు చెందిన ఓ వీడియో గేమింగ్ కంపెనీ తీసుకొచ్చిన ఆన్‌లైన్ మల్టీప్లేయర్ గేమింగ్ యాప్. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని గేమ్‌లో ప్రవేశించగానే ఒక ఐడీ లభిస్తుంది. ఇది ఎక్కువగా ఒక జట్టుగా ఆడే గేమ్. ఎంత మందితో ఈ గేమ్ ఆడాలి అనేది ముందే దీన్ని ఆడేవారు నిర్ణయించు కుంటారు. ఈ గేమ్ ఆడేవారు ప్రత్యేక సైనిక వేషధారుల్లా మారిపోతారు. అలాగే ఇది గ్రూప్ వాయిస్ గేమ్. అంటే ఈ గేమ్ ఆడేవారంతా ఎప్పటికప్పుడు మాట్లాడుకునే వెసులుబాటు ఈ యాప్‌లో ఉంది. ఈ గేమ్‌లో గరిష్టంగా వంద మంది ఉంటారు. దీన్ని ఆడేవారు ఏర్పాటు చేసుకున్న టీం తప్ప మిగతా వారంతా శత్రువుల కిందే లెక్క. దీంతో ఈ గేమ్ ఒక యుద్ధక్షేత్రాన్ని తలపిస్తుంది. పోటీదారులదరినీ చంపు కుంటూ పోవడమే ఈ ఆట. యుద్ధంలో ఉపయోగించే తుపాకులు, బాంబులతోపాటు శత్రువులకు చిక్కకుండా దాక్కునేందుకు బంకర్లు, గాయపడితే వైద్యం పొందేం దుకు మెడికల్ కిట్ వంటివి ఇందులో ఉంటాయి. ఒక్క సారి ఆటగాడు చనిపోతే గేమ్ అయిపోనట్లే లెక్క. అందుకే యుద్ధంలో ఎలాగైనా గెలవాలనే కసితో ఈ ఆటలో చని పోయిన ప్రతిసారీ తిరిగి గేమ్‌లో ప్రవేశించాలనుకుంటారు.
గుజరాత్ స్కూళ్లలో నిషేధం
పబ్‌జీ వల్ల బానిసలుగా మారిన యువతను చూసి చైనా ఈ గేమ్‌ను ఇప్పటికే పూర్తిగా నిషేధించింది. సర్వర్ లింకులను కూడా తొలగించి నెటిజన్లకు ఈ గేమ్ లింక్ దొరకకుండా చర్యలు చేపట్టింది. మరోవైపు గుజరాత్ ప్రభుత్వం కూడా ఈ ఆటను స్కూళ్లలో నిషేధిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులెవరూ స్కూళ్లకు స్మార్ట్‌ఫోన్లు తీసుకురాకూడదని స్పష్టం చేసింది. అలాగే దేశవ్యాప్తంగా ఈ గేమ్‌ను నిషేధించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు సైతం చేసింది. వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) సైతం హాస్టళ్లలోని విద్యార్థులు పబ్‌జీకి బానిసలవుతున్నారని గుర్తించి తమ సంస్థ ఆవరణలో దీన్ని ఆడటంపై నిషేధం విధించింది.
20 కోట్ల మంది యూజర్లు
ప్రపంచవ్యాప్తంగా పబ్‌జీ ఆడేవాళ్లు దాదాపు 20 కోట్ల మంది ఉన్నారు. ఏ సమయంలోనైనా ఈ గేమ్‌లో యాక్టివ్‌గా ఉండే వాళ్ల సంఖ్య 3 కోట్ల నుంచి 4 కోట్లుగా ఉంది. దీన్నిబట్టి ఈ ఆటకు ఎంత మంది బానిసలుగా మారారో అర్థంచేసుకోవచ్చు.
దేశంలో పబ్‌జీ ప్రభావం....
పబ్‌జీ కారణంగా జమ్మూకశ్మీర్‌లో ఇటీవల పది, పన్నెండో తరగతి పరీక్షా ఫలితాలు చాలా దారుణంగా వచ్చాయని, వెంటనే ఈ గేమ్‌పై నిషేధం విధించాలని ఆ రాష్ట్ర విద్యార్థుల సంఘా లు డిమాండ్ చేశాయి. ఆ రాష్ట్ర గవర్నర్ సత్య పాల్ మాలిక్‌ను కలసి ఈ మేరకు విజ్ఞప్తి చేశాయి. తెలుగు రాష్ట్రాల్లో సైతం పబ్‌జీ ప్రభావం అధికంగానే ఉంది. ఎక్కడ చూసినా విద్యార్థులు ఈ గేమ్‌లో మునిగితేలి కనిపిస్తున్నారు.
బానిసలుగా ఎందుకు మారుతున్నారు?
ఏదైనా ఆట ఆడేటప్పుడు గెలవాలనే కసి ఉండటం సహజం. కానీ పబ్‌జీ విషయంలో మాత్రం అది మరీ ఎక్కువ. ఈ గేమ్ ఆడుతున్నంతసేపూ యుద్ధం చేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది కాబట్టి యువత ఓడిపోయిన ప్రతిసారీ తిరిగి గేమ్‌లోకి ప్రవేశిస్తూ విజయం కోసం తహతహలాడుతోంది. ఈ ఆట ఆడే సమయంలో ఎవరు వచ్చినా పట్టించుకొరు. గేమ్ నుంచి క్షణం దృష్టి మరిల్చినా చనిపోతామనే భయంతో ఎవరు పిలిచినా పట్టించుకోరు. ఎవరు ఫోన్లు చేసినా కట్ చేస్తారు. మానసికంగా పూర్తిగా దానికే అంకితమవుతూ విచక్షణారహితంగా ప్రవర్తిస్తుంటారు.
పబ్‌జీ ఆడే వారిలో కనిపించే లక్షణాలు...
►చదువులో ఏకాగ్రత లోపించడం
► కోపం, చిరాకు ప్రదర్శించడం, దుందుడుకు స్వభావం
► ఎవ్వరితోనూ కలవలేకపోవడం
► నిద్రలేమి, కంటి సమస్యలు
Comments
Please login to add a commentAdd a comment