భారత్‌లో పబ్‌జీ కథ ముగిసినట్లేనా? | Pubg Story Is Closed In India | Sakshi
Sakshi News home page

భారత్‌లో పబ్‌జీ కథ ముగిసినట్లేనా?

Published Thu, Sep 10 2020 11:55 AM | Last Updated on Thu, Sep 10 2020 6:43 PM

Pubg Story Is Closed In India - Sakshi

(వెబ్‌ స్పెషల్‌): ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్‌ యూజర్లకు కొత్తగా పరిచయం అక్కర్లేని ఆట పబ్‌జీ. ఈ గేమ్‌కు ఉన్నంత క్రేజ్‌ కొంతమంది సినీ నటులకు కూడా లేదని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మొబైల్‌ గేమ్స్‌ ఆడే వారిపై ఈ గేమ్‌ ఎంతలా ప్రభావం చూపిందో చెప్పటానికి వందల సంఖ్యలో నమోదైన ఆత్మహత్యలు, హత్యలే ఓ ఉదాహరణ. భారత్‌-చైనాల మధ్య ఏర్పడ్డ యుద్ధ వాతావరణం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పబ్‌జీ సహా 118 చైనా యాప్స్‌ని నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే పబ్‌జీ గేమ్ రూపకర్త సౌత్ కొరియాకు చెందిన గేమింగ్ కంపెనీ పబ్‌జీ కార్పొరేష‌న్ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఈ గేమ్‌ ఫ్యాన్స్‌లో కొత్త ఆశలు మొదలయ్యాయి.

పబ్‌జీ ప్రస్థానం 
'ప్లేయర్ అన్‌నోన్స్ బ్యాటిల్‌ గ్రౌండ్స్'(పబ్‌జీ)ని దక్షిణ కొరియాకు చెందిన బ్రెండన్‌ గ్రీన్‌ అనే వ్యక్తి రూపొందించాడు. పబ్‌జీ కార్పొరేషన్ అనే గేమింగ్‌ సంస్థ 2017లో దీన్ని మార్కెట్‌లోకి విడుదల చేసింది. ​‍2017 మార్చిలో తొలిసారిగా మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ యూజర్లకు గేమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. అనంతరం 2018 సంవత్సరంలో ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యూజర్లకు, 2020 సంవత్సరంలో ప్లేస్టేషన్‌ 4, స్టాడియా యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. అయితే పబ్‌జీ మొబైల్‌ గేమ్‌గానే చాలా మందికి సుపరిచితం. అంతేకాదు మిగిలిన అన్ని ప్లాట్‌ఫాంల కన్నా మొబైల్‌ వర్సన్‌లోనే పబ్‌జీకి క్రేజ్‌ ఎక్కువ. దీన్ని ఇప్పటివరకు 600 మిలియన్ల మందికి పైగా ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యూజర్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ( భారత్‌లో రీ ఎంట్రీకి పబ్‌జీ మాస్టర్‌ ప్లాన్‌ )

ఇండియాలో పబ్‌జీ హవా 
ఇండియాలో 2018 నుంచి బాగా పాపులర్‌ అయిన ఈ గేమ్‌ రెండేళ్లలో ప్రపంచంలోనే అత్యధిక పబ్‌జీ ప్లేయర్స్‌  కలిగిన దేశంగా మారింది. దీన్ని ఇప్పటి వరకు 116 మిలియన్ల మంది భారతీయులు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 600 మిలియన్లకు పైగా మంది పబ్‌జీ ప్లేయర్స్‌ ఉండగా మన దేశంలోనే 22% ఉన్నారు. మొబైల్‌లో గేమ్‌ ఆడుతున్నట్లు కాకుండా మనమే యుద్ధ రంగంలోకి దిగి గేమ్ ఆడుతున్న ఫీల్‌ ఉండటంతో జనం ఎక్కువగా దీనికి బానిసలయ్యారు. కొంతమంది గేమ్‌ ఆడకపోతే ఊపిరాడదు అన్నట్లుగా మారిపోయారు.‌ పబ్‌జీ క్రైం రేటు కూడా ఇండియాలో బాగానే పెరిగిపోయింది.

ఇండియాలో పబ్‌జీ బ్యాన్‌ 
భారత్‌ - చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో రెండు నెలల క్రితం 59, జూలై  నెలాఖరున 47 చైనా యాప్‌లను కేంద్రం నిషేధించింది. తాజాగా గత బుధవారం చైనాకు చెందిన మరో 118 యాప్‌లను నిషేధించింది. వీటిలో దక్షిణ కొరియాకు చెందిన, చైనాతో భాగస్వామ్యం ఉన్న పబ్‌జీ కూడా ఉండటం గమనార్హం. సదరు యాప్స్‌ భారత పౌరుల వ్యక్తిగత గోప్యతకూ, డేటా భద్రతకూ, దేశ సార్వభౌమత్వానికి ఇవి ముప్పు కలిగిస్తున్నాయని కేంద్రం తెలిపింది. ( పబ్‌జీ బ్యాన్ : పబ్‌జీ కార్పొరేష‌న్ కీలక ప్రకటన )

పబ్‌జీ రాకపై కొత్త ఆశలు 
దేశంలో పబ్‌జీ బ్యాన్‌తో పెద్ద మార్కెట్‌ను కోల్పోయింది గేమ్‌ రూపకర్త దక్షిణ కొరియాకు చెందిన పబ్‌జీ కార్పొరేషన్‌. దీనిపై కొద్దిరోజుల క్రితం స్పందిస్తూ ప‌బ్‌జీ మొబైల్‌, ప‌బ్‌జీ మొబైల్ లైట్ గేమ్‌ల‌కు ప‌బ్లిషింగ్ హ‌క్కుల‌ను తామే  స్వయంగా పర్యవేక్షిస్తామని, ఇక‌పై చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్స్ తో త‌మ‌కు ఎలాంటి సంబంధం ఉండ‌ద‌ని తేల్చి చెప్పింది. ఇండియాలో పబ్‌జీకి పూర్వ వైభవం తెచ్చేందుకు చైనా స్టేక్‌ హోల్డర్స్‌కు బై చెప్పి ఓ ఇండియన్‌ గేమింగ్‌ దిగ్గజంతో చేతులు కలిపేందుకు ప్రయత్నిస్తోంది. భారత్‌లో ఈ గేమ్‌ను నిషేధించటానికి ప్రధానం కారణం చైనాతో సంబంధాలే. ఒక వేళ పబ్‌జీ కార్పొరేషన్‌ చైనాకు దూరమై, భారత్‌కు దగ్గరైతే కనుక ఈ గేమ్‌ ఇండియాలోకి తిరిగొస్తుందన్నది నిర్వివాదాంశం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement