నేతాజీని చంపించింది స్టాలినే: స్వామి
నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం గురించి ఇప్పటికీ పలు రకాల వాద ప్రతివాదాలు జరుగుతూనే ఉంటాయి. అయితే.. ఆయన 1945లో ఓ విమాన ప్రమాదంలో మరణించలేదని, సోవియట్ అధినేత జోసెఫ్ స్టాలిన్ ఆయనను చంపించారని బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యం స్వామి ఆరోపించారు. ఈ విషయమై ఉన్న రహస్య ఫైళ్లను బయటపెట్టాలని ఆయన డిమాండు చేశారు. సైబీరియా ఎడారిలో రహస్య ప్రాంతంలో నేతాజీని స్టాలిన్ చంపించారని స్వామి ఆరోపించడం సంచలనం రేపింది.
అయితే.. దీనికి సంబంధించిన రహస్య ఫైళ్లను బయటపెడితే మాత్రం భారతదేశానికి బ్రిటన్ తోను, రష్యాతోను ఉన్న సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని మాత్రం స్వామి అన్నారు. ఈ వివాదం విషయాన్నితాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చిస్తానని తెలిపారు. ఇన్నాళ్లూ నేతాజీ మరణశిక్ష నుంచి తప్పించుకుని చైనాలోని మంచూరియా ప్రాంతంలో దాక్కున్నట్లు వాదనలున్నాయని, కానీ వాస్తవానికి ఆయనను స్టాలిన్ సైబీరియాలోని ఓ జైల్లో పెట్టారని తెలిపారు. 1953 ప్రాంతంలో ఆయనను ఉరితీయడమో.. లేదా ఊపిరాడకుండా చేసి చంపడమో చేశారని స్వామి చెప్పి పెద్ద బాంబే పేల్చారు.